Home News Stories

వైసీపీలో ఏం జరుగుతోంది?

పాలనా వికేంద్రీకరణ కోసమే ఏపీలో మూడు రాజధానులంటోంది వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే ప్రాంతీయ ఉద్యమాలు తెరపైకొస్తాయంటోంది. వాదన బావుంది. ఆలోచన భేషుగ్గా ఉంది. అయితే పాలనకే కాదు పార్టీకి, తమ ప్రజాప్రతినిధులకు కూడా ఈ లెక్కే వర్తిస్తుందన్న లాజిక్‌ ని మాత్రం వైసీపీ మరిచిపోతున్నట్లు కనిపిస్తోంది. పాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా ఉండేందుకు..ఎక్కడా లేనివిధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కూడా శ్రీకారం చుట్టింది. అంతా బానే ఉందికానీ….అధికారులు, పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య, మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉందో లేదో మాత్రం సరిగా చూసుకోలేకపోతోంది.

పార్టీ పెద్దలు మితిమీరిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లో, లేదంటో మరో కారణమోగానీ..ఏపీలో కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులను అధికారులు కేర్‌ చేయడం లేదు. దాంతో కొందరు ప్రజాప్రతినిధుల్లో అసహనం పెరుగుతోంది. మరోవైపు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలను లెక్కలోకి తీసుకోవడం లేదు. తాము ముఖ్యమంత్రికే జవాబుదారీ అన్నట్లు వ్యవహరిస్తున్న మంత్రుల తీరుతో కొన్నిచోట్ల గ్యాప్‌ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో స్వయానా స్పీకర్‌ తమ్మినేని సీతారాంనే లెక్క చేయడం లేదు కొందరు అధికారులు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే తీరే సమస్య అయితే ఈ పాటికి ఆయన ఆ పనిచేసుండేవారు. కానీ ఓపెన్‌ కామెంట్స్‌ చేశారంటేనే గ్రౌండ్‌ లెవల్‌ లో పరిస్థితులెలా ఉన్నాయో అర్ధమైపోతుంది. మైనింగ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తీరు ఏ మాత్రం బాగా లేదని ఒంటికాలిమీద లేచారు స్పీకర్‌ తమ్మినేని. ప్రభుత్వం చేపడుతున్న పనుల కోసం ఇసుక తీసుకెళ్తున్నాఅడ్డుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ పక్క ఏ రాష్ట్రంలో లేని పారదర్శకమైన ఇసుక పాలసీ ఏపీలో ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే…స్పీకర్‌ స్వయానా సీరియస్‌ కావడం దేనికి సంకేతం? సెబ్‌ అని తుబ్‌ అని ఎన్నో వచ్చినా పరిస్థితులు మారలేదని సమీక్షా సమావేశంలోనే అసహనం వ్యక్తంచేశారు తమ్మినేని. కొందరు అధికారులు తాము అతీతులమన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. శాసనభాపతిగా తాను అలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూనే, అనాల్సిన నాలుగు మాటలూ అనేశారు. ఒక్క తమ్మినేననే కాదు….వైసీపీ ప్రభుత్వంలో పదులసంఖ్యలో ప్రజాప్రతినిధులకు ఇదే అనుభవం ఎదురవుతోంది.

అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య అక్కడక్కడా గ్యాప్‌ వస్తుంటే…మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య కూడా కోఆర్డినేషన్‌ కరువవుతోంది. మొన్నో మహిళా వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నంతో వివాదంలో చిక్కుకున్న తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అయ్యుండీ మంత్రులను దుష్టశక్తులతో పోల్చారు చిట్టిబాబు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనకు మంత్రులెవరూ సహకరించడం లేదని పబ్లిక్ ప్రోగ్రాంలో పదిమందిలో ప్రభుత్వ పరువు తీసేశారు వైసీపీ ఎమ్మెల్యే.

ప్రభుత్వంలో, ప్రజాప్రతినిధుల మధ్య మొదట సమన్వయం కుదర్చకుండా, ఇంటి సమస్యలు తీర్చుకుండా ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదనేది ఆఫ్‌ ది రికార్డ్‌ గా వైసీపీ నేతలు చెబుతున్నమాట. మరి పాలనా వికేంద్రీకరణ మీద దృష్టిపెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌…మొదట సొంతింటి సమస్యలను చక్కదిద్దుకుంటారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here