Home News Politics

వైసీపీ వార్ టీం రెడీ….?

మూడు సార్లుగా వాయిదాపడుతూ వచ్చిన వైసీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద ప్రకటించారు. 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేశారు. ఎంపీ అభ్యర్థుల పేర్లను బాపట్ల లోక్‌సభ అభ్యర్థి నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. అసెంబ్లీ జాబితాలో 49 మంది రెడ్డి సహా అగ్రవర్ణాలకు 86, కాపు-35, ఎస్సీ-29, ఎస్టీ-7, ముస్లింలకు 5 స్థానాలకు కేటాయించారు. 40 మంది సిటింగ్‌లకు మళ్లీ చాన్సిచ్చారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు, మదనపల్లె ఎమ్మెల్యేలు సునీల్‌, దేశాయ్‌ తిప్పారెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డిలకు ఈ దఫా అవకాశమివ్వలేదు. కాగా తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌ను ఈ దఫా గూడూరు (ఎస్సీ)స్థానంలో బరిలోకి దించారు. టీడీపీ నుంచి ఇటీవలే వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు తిరుపతి ఎంపీ సీటు దక్కింది. శ్రీకాకుళం లోక్‌సభకు గానీ, టెక్కలి అసెంబ్లీకి గానీ పోటీచేయాలని భావించి.. మూడ్రోజుల క్రితం వైసీపీలో చేరిన కిల్లి కృపారాణి దంపతులకు అవకాశమివ్వలేదు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీకి పోటీచేయిస్తారని ప్రచారం జరిగినా.. ఆమెకు కూడా రిక్తహస్తమే చూపారు.

నెల్లూరు రూరల్‌ నుంచి టీడీపీ టికెట్‌ దక్కించుకుని ఆకస్మికంగా వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక్కడ సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వలేదు. జగన్‌ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డిని బరిలోకి దించారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణకు చీపురుపల్లి, ఆయన సోదరుడు అప్పలనర్సయ్యకు గజపతినగరం, ఆయన తోడల్లుడు అప్పలనాయుడికి నెల్లిమర్ల టికెట్లు ఇచ్చారు. కానీ ఆయన భార్య ఝాన్సీకి విజయనగరం ఎంపీ టికెట్‌ ఇవ్వలేదు. ఇక్కడ ఒకప్పటి ఆయన అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్‌ను పోటీచేయించారు.

ఈసారి బీసీలకు 41 సీట్లు ఇచ్చామని, చంద్రబాబులాగా జాబితాలో బలిజలకు (కాపు) టికెట్లు ఇచ్చి బీసీ జాబితాలో చూపి మోసం చేయలేదని జగన్‌ అన్నారు. వైసీపీలో బలిజలకు ఇచ్చిన సీట్లను కలుపుకొంటే 45 సీట్లు కేటాయించినట్లు అవుతుందని తెలిపారు. ముస్లింలకు గతంలో కంటే ఒక సీటు అధికంగా ఇచ్చి మొత్తం 5 సీట్లు కేటాయించామన్నారు. జాబితా విడుదల కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ‘దేవుడి దయ, నాన్న దీవెనలతో ప్రజల ఆశీస్సులతో అభ్యర్థులంతా గెలవాలి. సిటింగ్‌లలో కొందరికి టికెట్లు ఇవ్వలేదు. ప్రజాభిమానం, సర్వే ప్రాతిపదికన, ఇతరత్రా కూడా పరిశీలించి సీట్లు ఖరారుచేశాం’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here