Home News

పార్టీ రిజిస్ట్రేషన్ సరే..తెలంగాణలో షర్మిల పార్టీకి ఉన్న స్పేస్ ఎంత…!

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రయత్నంలో కీలకమైన అడుగు వేశారు షర్మిల. ఊహాగానాలు, అంచనాలు అన్నీ దాటుకుని పార్టీని రిజిస్టర్ చేశారు. వైఎస్‌ జయంతి రోజు జూలై8న కొత్త పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఇదివరకే ఆమె ప్రకటన చేశారు. ఆ రోజే పార్టీపేరు జెండా అజెండా అన్నీ ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై అనేకమందితో చర్చలు, ఆత్మీయ సమావేశాలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చర్చగా మారిన షర్మిల పార్టీ, ముందు ముందు ఎలా ఉండబోతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ తో కాంగ్రెస్,బీజేపీ హోరాహోరి పోరాడుతున్నాయి. అసలు తెలంగాణలో షర్మిల పార్టీకి స్పేస్ ఉందా అన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

షర్మిల పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందీ అని అదీకాక, సామాజిక వర్గాల పరంగా చూస్తే కాంగ్రెస్‌ కు కొంతమేర నష్టం ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి. అంటే షర్మిల పార్టీ ద్వారా నష్టమంటూ జరిగితే అది కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువగా ఉంటుంది.తెలంగాణ కాంగ్రెస్ నుంచి గతంలో వైఎస్ తో పనిచేసిన నేతలు కూడా తన వైపు వస్తారనేదే షర్మిల ఆశ. ఇదంతా కలిసి, చివరికి కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందనే అంచనాలున్నాయి. అంటే పరోక్షంగా టిఆర్ఎస్‌ కు లాభమే ఉంటుంది తప్ప, ఆ పార్టీ పీఠాలు కదిలే అవకాశం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అదే సమయంలో షర్మిల కెసీఆర్‌ పై విమర్శలు కూడా చేసి, బంగారు తెలంగాణ కాదు రాజన్న రాజ్యం అని చెప్పటం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని నిర్మించుకోవాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత రావటం రాజకీయాల్లో సాధారణం. ఈ వ్యతిరేక ఓట్లు విపక్షాల బలాన్ని పెంచుతాయి. ఆ బలం ఏమేరకు అనేదే ప్రశ్న. బిజెపి పరిమిత ప్రాంతాల్లోనే బలపడుతోంది. తెలంగాణ మొత్తంగా చూస్తే, బిజెపి ప్రభావం స్వల్పమే. అటు కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచినా ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేసే పరిస్థితి లో లేదు. ఈ రెండిటి పక్కనా షర్మిల పార్టీ కూడా మరో వాటాదారుగా చేరుతుందా అన్న చర్చ మొదలైంది.

ఓవరాల్‌ గా షర్మిల పార్టీ ప్రభావం. కాంగ్రెస్ ఓట్లు చీలటంపైనే తప్ప, తాను సొంతంగా అధికారం చేజిక్కించుకునేంత స్థాయిలో లేదనే చెప్పాలి. తెలంగాణలో వైఎస్ అభిమానులున్నారని షర్మిల లెక్కేసుకుంటున్నా, ఓ పార్టీ విజయవంతం అయ్యే స్థాయిలో ఆ అభిమానం ఉపయోగపడుతుందా అనేది ముఖ్యమైన ప్రశ్న. వైఎస్ కు సమైక్యవాదిగా గుర్తింపు ఉండటమే కాదు.. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో కూడా మానుకోటలో రణరంగం జరిగింది. అలాంటి సమైక్యవాది కుటుంబానికి చెందిన షర్మిల తెలంగాణ సెంటిమెంట్ ను ఎలా సొంతం చేసుకుంటారనేది కీలకమైన ప్రశ్న. ఈ సమయంలో షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం నినాదం వైపు ప్రజలు ఆకర్షితులవటం అంత తేలిక కాదు. రాజకీయ పార్టీ పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. విస్తృతంగా జనంలోకి వెళ్లాలి. పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉండాలి.చెప్పుకోదగ్గ నేతలు ఉండాలి. ఇవన్ని షర్మిలకు ఏమేరకు సాద్యమవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here