Home News

కేబినెట్‌ బెర్త్‌ పై గురిపెట్టిన వైసీపీ సీనియర్లు..వీరిలో చాన్స్ ఎవరికో..?

రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చెప్పారు ఏపీ సీఎం జగన్‌. ఇప్పుడా సమయం సమీపిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలలో కదలికలు..చర్చలు మొదలయ్యాయి. కేబినెట్‌ నుంచి ఎవరు ఔట్‌.. ఎవర్‌ ఇన్‌ అనే చర్చ ఆసక్తి కలిగిస్తోంది. హామీలు పొందినవారి సంఖ్య అధికార పార్టీలో ఎక్కువగానే ఉంది. ఇక సీనియర్ల మాట సరేసరి. అప్పుడెలాగో ఛాన్స్‌ మిస్‌ అయింది. ఇప్పుడు వదులుకోకూడదని గట్టి పట్టే పడుతున్నారట. అయితే జిల్లాల్లో ఉన్న సమీకరణాల వల్ల ఎవరూ గట్టి నమ్మకానికి రాలేకపోతున్నారట నాయకులు.

నెల్లూరు జిల్లా నుంచి అనిల్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి కేబినెట్‌లో ఉన్నారు. వీరిద్దరూ సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిని మార్చకుండా కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తారా అలా ఇస్తే ఎవరికి పదవీయోగం ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నవారిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఉన్నారు. తొలివిడతలోనే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు కాకాణి. ప్రస్తుతం శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ దఫా తప్పకుండా కేబినెట్‌లో చోటు కల్పిస్తారని కాకాణి వర్గం ఆశలు పెట్టుకుందట. పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాలు ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే శైలి.. మొదటి నుంచి జగన్‌కు మద్దతుగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా లెక్కలేసుకుంటున్నారు.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎస్సీ కోటాలో మంత్రి పదవి తప్పకుండా వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారట. మేకపాటి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ విషయంలో అక్కరకు వస్తాయని అనుకుంటున్నారట. ఇటీవల తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో సూళ్లూరు పేట నుంచి భారీ మెజారిటీ రావడం.. మున్సిపల్‌ ఎన్నికల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట పురపాలక సంఘాల్లో వైసీపీ జెండా రెపరెపలాడించడం కలిసి వస్తాయని లెక్కలేసుకుంటున్నారు సంజీవయ్య. ఆ మధ్య సంచలన కామెంట్స్‌తో పార్టీలో కాక పుట్టించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం కేబినెట్‌ రేస్‌లో ఉన్నారు. వచ్చే రెండున్నరేళ్లూ వైసీపీకి రాజకీయంగా కీలకం కాబట్టి సీనియర్‌ అయిన తమ నేతకు తప్పకుండా పిలుపు వస్తుందని ఆనం శిబిరం ఆశతో ఉంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ఉన్నారు

ఇప్పటికే జిల్లా నుంచి కేబినెట్‌లో ఉన్నవారిని కదల్చకపోతే.. కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అన్న అనుమానాలు ఉన్నాయట. అనిల్‌ అటు ప్రతిపక్షంలో ఉండగా.. ఇటు అధికారం వచ్చిన తర్వాత కూడా టీడీపీని ఏకిపారేయడంలో ముందు ఉంటున్నారు. మొదటిసారే అయినప్పటికీ భారీ నీటిపారుదల శాఖ ఇచ్చినా వివాదాలు లేకుండా చేసుకుపోతున్నారు. ఈ లెక్కలు చూసుకుంటే తొలిగించే 90 శాతంలో ఆయన ఉండటం అనుమానమే. ఇక గౌతంరెడ్డి. నెల్లూరులో రెడ్డి మంత్రి తప్పనిసరి. ఆయన్ను తప్పిస్తే ఇంకో రెడ్డికే ఛాన్స్‌ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆ లెక్కను పరిగణనలోకి తీసుకుంటే.. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒకరికి ఛాన్స్‌ ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here