Home News Updates

విశాఖలో రూటు మార్చిన వైసీపీ..ఆ వర్గమే టార్గెట్ గా రాజకీయం

విశాఖజిల్లా రాజకీయాలు సామాజిక సమీకరణాలు చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. ఇక్కడ ఓటర్లు, జనాభా ప్రాతిపదికన కాపు, యాదవ, వెలమ, గవర, మత్స్యకార కులాలు ముఖ్యమైనవి. ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి వీటికే ఉంది. రాజకీయపార్టీల ప్రాధాన్యాలు వీటికి అనుగుణంగానే ఉంటాయి. ఓ వర్గానికి దగ్గరయ్యేందుకు అధికారపార్టీ మూడేళ్ల ముందు నుంచే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో షాకిచ్చిన సిటీలో ఈ సారి కొత్త వ్యూహాన్ని ఎక్కుపెడుతుంది.

సాధరణ మత్యకార నగరం నుంచి పరిపాలన రాజధాని స్ధాయికి ఎదుగుతోంది విశాఖ. ఈ నగరంలో కాపులు, యాదవులదే ఆధిపత్యం. టీడీపీకి మొదటి నుంచి వీరే బలమైన ఓట్ బ్యాంక్. 2019లో టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు వైసీపీ గట్టి ప్రయత్నం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అనుకున్న ఫలితం సాధించినప్పటికీ గ్రేటర్ విశాఖలో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తప్ప లేదు. సిటీ పరిధిలోని నాలుగు కీలక నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ గూటికి చేరారు. అయితే ఈ చేరికలతో సరిపెట్టని వైసీపీ సామాజిక సమీకరణల పై దృష్టి పెట్టింది.

జీవీఎంసీ ఎన్నికల్లో వాసుపల్లి చేరిక ఎఫెక్ట్ పెద్దగా పని చేయకపోవడంతో ఇక గ్రౌండ్ లెవల్లో ఓ వర్గాన్ని అక్కున చేర్చుకునే పనిలో పడింది. మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టి అమలు చేయడం ప్రారంభించింది వైసీపీ. పార్టీలోనూ పదవుల్లోనూ తమకు ప్రాధాన్యం పెరగాలని బలమైన సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి. గ్రేటర్ విశాఖ ఎన్నికలపైన ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ వ్యూహం మార్చింది. విశాఖపై పట్టు సాధించడమే లక్ష్యంగా యాదవ సామాజిక వర్గంపై ఫోకస్ పెంచింది.

ఇప్పటికే మరో సామాజికవర్గం కాపులకు పెద్దపీట వేయగా ఇప్పుడు యాదవులను ఆకర్షిస్తోంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో యాదవ సామాజికవర్గం ఓటర్ల సంఖ్య సుమారు 3 లక్షలు. భీమిలిలో 48వేలు, తూర్పులో 40వేలు, గాజువాక 45వేలు, దక్షిణంలో 22 వేలు, పశ్చిమ నియోజకవర్గంలో25వేలు, నార్త్ లో 25వేలు, ఎస్.కోట30వేలు, పెందుర్తి 35వేల మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాలను కలుపుకుని పోతూనే యాదవుల మద్దతు కూడగట్టగలిగితే ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చేనది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉంది.

జీవీఎంసీకి సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు జరిగాయి. బీసీ జనరల్‌కు మేయర్ సీటు రిజర్వ్ అయినా.. మహిళకు ప్రాధాన్యం ఇచ్చింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది. త్వరలో విశాఖజిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. స్ధానిక సంస్ధల కోటాలో వచ్చే ఆ రెండు పదవుల్లో ఒకటి యాదవులకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.ఎగ్జిక్యూటివ్ రాజధానిలో కీలకమైనది విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ. ఈ సంస్ధ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఇది కూడా వారికే దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్ చార్జ్ అక్కరమాని విజయ నిర్మల ఫ్యామిలీ, నగరపార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి అవకాశం కల్పిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో నలుగుతోంది. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల పంపిణీలోనూ ఎక్కువ శాతం యాదవులకు దక్కేలా చూడాలనేది స్ధానిక నాయకత్వం ఆలోచన. అదే జరిగితే తెలుగుదేశంపార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బలమైన సామాజికవర్గాన్ని దూరం చేసినట్టు అవుతుందనేది పొలిటికల్ స్ట్రాటజీ. దశల వారీగా అన్ని సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవడం ద్వారా ఏ చిన్న చాన్స్ కూడా విపక్షాలకు ఇవ్వకూడదన్నది వైసీపీ అధినేత జగన్ ఆలోచనగా తెలుస్తుంది. జిల్లాలో ముగ్గురు కాపు ఎమ్మెల్యేలు ఉండగా.. అవంతికి మంత్రిపదవి లభించింది. అనకాపల్లి శాసనసభ్యుడు అమర్నాథ్‍ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కాపుల కోటాలోనే భర్తీ చేసింది.

అయితే అన్ని పదవులూ యాదవులకే కేటాయిస్తే మిగిలిన వారి మాటేంటనే భావన పార్టీ అంతర్గత వర్గాల్లో ఉంది. అయితే కాపు, యాదవుల కోటాను పూర్తి చేసిన తర్వాత మిగిలిన వారికీ సముచిత స్ధానం ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here