Home News

వైసీపీ నుంచి ఆ నలుగురికి ఛాన్స్…!

ఏపీలో గవర్నర్ కోటా శాసన మండలి సభ్యుల జాబితా సిద్ధం అయ్యింది. నలుగురు శానస మండలి సభ్యుల పదవీ కాలం పూర్తి కావటంతో వైసీపీ ఖాతాలో ఆ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు పడనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రతిపాదిత పేర్ల జాబితా గవర్నర్‌కు పంపించనున్నట్లు సమాచారం.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో నామినేట్ అయిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 11తో ముగిసింది. టీడీ జనార్దన్, బీద రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, పి. శమంతకమణిలను అప్పటి టీడీపీ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద మండలిలో అవకాశం కల్పించింది. వీరి పదవీ కాలం పూర్తి కావటంతో ఈ నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఈ నలుగురిలో శమంతకమణి ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. వైసీపీ ప్రతిపాదిత జాబితాలో అన్ని సమీకరణాలను చూసుకుని నాలుగు పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ళ అప్పిరెడ్డి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కార్యాలయ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా సామాజిక సమీకరణాల్లో భాగంగా దక్కలేదు. రాజశేఖర రెడ్డి హయాం నుంచే వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ రేసులో ఈయన పేరు దాదాపు ఖాయం అయినట్లే అని సమాచారం. ఇక మోషేన్‌ రాజు అని మరో వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్‌ రాజు కూడా ముందు నుంచీ వైఎస్‌కు అనుచరుడిగా ఉన్నారు. 2009లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గానికి చోటు కల్పించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తుల పేరు కూడా ఖాయం అయినట్లు సమాచారం. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఒకసారి స్వతంత్రుడిగా, ఒకసారి కాంగ్రెస్‌ నుంచి, రెండుసార్లు టీడీపీ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓటమి పాలైన తర్వాత వైసీపీ తీర్ఘం పుచ్చుకున్నారు త్రిమూర్తులు. ఇక రాయలసీమ నుంచి రమేష్‌ యాదవ్‌ పేరు వినిపిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆర్‌. వి. రమేష్‌ యాదవ్‌ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్‌ కౌన్సెలర్‌గా పోటీ చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి వస్తుందని ఆశించినా…సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కలేదు. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మండలిలో అవకాశం కల్పించారని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here