Home News

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు

కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు పడకలను పెంచుతూ ప్రభుత్వం చర్యలు చేపట్టినా రోగుల సంఖ్య అంతకు మించి ఉంటోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత అంతగా లేదు. ఇప్పుడు ఆక్సిజన్ అవసరం పెరిగింది. చికిత్సకు వాడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ దొరక్క.. వేలు, లక్షలు పెట్టి బ్లాక్‌లో కొనలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారు ఎందరో. ఇలాంటి బాధితుల తరఫు బంధువులు తమ ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి సాయం కోరుతున్నారు. ఏపీవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో ఒక వింగ్ ఏర్పాటు చేసి మరివైసీపీ ఎమ్మెల్యేలు కరోనా పేషెంట్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కంటిపై కునుకు లేకుండా చేస్తుందట. నియోజకవర్గాల ప్రజల నుంచి అదే పనిగా ఫోన్లు వస్తున్నాయట. ఆస్పత్రిలో పడకలు.. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు.. ఆక్సిజన్‌ కోసం బాధితుల బంధువుల నుంచి కాల్స్‌ వస్తుండటంతో ఎవరికి వారే పరిష్కారం కనుగొన్నారట. కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ఎమ్మెల్యేలకు వస్తోన్న ఫోన్లలో ఇలాంటివే ఎక్కువగా ఉంటున్నాయట. ఆ టైమ్‌లో బెడ్లు ఏర్పాటు చేయడం.. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారట ఎమ్మెల్యేలు. జిల్లాకు చెందిన ఓ మంత్రి తన పీఎస్‌కు ఓ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ను అనుసంధానం చేశారట. ఎవరైనా సాయం కోరితే.. పీఎస్‌తో మాట్లాడించి.. కరోనా రోగి అని నిర్ధారణ పత్రం, ఆధార్ కార్డు తీసుకుని రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఏనీ టైం ఇప్పిస్తున్నారట.

ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల కేటాయింపునకు సంబంధించి తెలిసిన వ్యక్తిని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నారట జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే. ఎవరికైనా అత్యవసరమైతే ఆ ఎమ్మెల్యేనే ఫోన్‌ చేస్తున్నారట. మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరధిలో ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలతో నిత్యం టచ్‌లో ఉంటూ.. బెడ్ ఖాళీ అవగానే తన వారికి ఇవ్వాలంటూ సిఫారసు చేస్తున్నారట. ప్రత్యేకంగా తన కార్యాలయంలో ఇద్దరు స్టాఫ్‌ను ఏర్పాటు చేసుకుని మరీ కరోనా సాయం కోసం వచ్చిన వారికి అండగా ఉంటున్నారట ఇంకో ప్రజాప్రతినిధి. మొత్తానికి కరోనా దెబ్బకి కంటి మీద కునుకే లేకుండా పోయిందంటున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం చేస్తున్న సాయానికి తోడు తాము కూడా అలర్ట్‌గా ఉంటే.. అది పేదలకు.. ఆపన్నులకు అక్కరకు వస్తుందని అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్యేలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here