ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు…అని బోర్డు కూడా రెడీ అయ్యింది. అయ్యిందని సోషల్‌మీడియాతో పాటు నాయకుల నోళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇదే విషయం చెబుతూ టీడీపీ దెప్పిపొడుస్తోంది. ఇక ఎవరు రెవెన్యూ మినిస్టరో, ఎవరు హోంమినిస్టరో అప్పుడే చర్చ జరుగుతోంది. రాబోయే కాలానికి కాబోయే హోంమినిస్టర్‌గా గుడివాడ-కొడాలినాని, నగరి-రోజా పేర్లపై చర్చ జరుగుతోంది. ఇక ఏ జిల్లాల్లో ఎవరెవరికి మంత్రియోగం ఉందో అప్పుడే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎన్నికల తర్వాత ఫలితాల వెల్లడికి నెలన్నర గ్యాప్ ఉంటే అప్పటిదాకా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేరుగా! ఎవరి లెక్కల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.
ఫేస్‌లో ఫ్రస్టేషన్ కనిపిస్తున్నా నూట పాతిక సీట్లు మావేనంటున్నారు చంద్రబాబు. ఎత్తిన కత్తిని దించేది లేదని అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలుపెట్టిన ధర్మపోరాటాన్ని ఏదో రూపంలో ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. స్టేట్‌లో తేడావచ్చినా సెంటర్లో అనుకూలమైన ప్రభుత్వం ఉంటే చాలనుకున్నారో, ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లు…రెండుచోట్లా చక్రం తిప్పేది తానేననుకుంటున్నారోగానీ…క్షణం తీరిక లేకుండా మోడీతో పాటు ఎలక్షన్ కమిషన్ మీద చంద్రబాబు వీరపోరాటం సాగుతోంది. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికే అనుకూలమని టీడీపీ చెబుతుంటే…కసిమీదున్న జనం టీడీపీని ఓడించేందుకు వెల్లువలా వచ్చారన్నది వైసీపీ మాట.
సరే…జనం ఎవరివైపో.. అధికారంలోకొచ్చేది ఎవరో మే 23న తేలిపోతుంది. వైసీపీ మాత్రం విజయంపై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఎంతలా అంటే కేబినెట్ కూర్పుమీద కూడా అప్పుడే దృష్టిపెట్టేంతలా! నిజానికి జగన్ ఈ తరహా కసరత్తు మొదలు పెట్టారోగానీ… కొత్త ప్రభుత్వంలో కొలువుదీరే కేబినెట్లో అవకాశాలు ఎవరికనే దానిపై మాత్రం వైసీపీలో ఓ రేంజ్ చర్చ జరుగుతోంది. ఏ జిల్లానుంచి ఎవరు మంత్రులవుతారో ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. కులాలవారీగా, ప్రాంతాలవారీగా, అధినేతకున్న నమ్మకం ఆధారంగా కొందరు నేతలయితే ఫలితాలకు ముందే కాబోయే మంత్రిగా ప్రచారంలోకొచ్చేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలోనూ వైసీపీ ఇలాంటి లెక్కలే వేసుకుని భంగపడిందని తమ్ముళ్లు దెప్పిపొడుస్తున్నారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తారనే అంచనాలతోనే మోడీ, కేటీఆర్, జగన్ తమ సార్ బర్త్‌డేకి పనిగట్టుకుని విషెస్ చెప్పారన్నది టీడీపీ వీరాభిమానుల మాట. గెలుపు గ్యారంటీ కాబట్టే….క్లైమాక్స్‌లో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా అడ్డుకునేందుకు ఈసీకి ఫిర్యాదు చేశామన్నది వైసీపీ వాదన. చంద్రబాబు మాజీ కావడం ఖాయమని, కాబోయే మంత్రులెవరని తమ పార్టీలో చర్చ జరుగుతోందంటే గెలుపుపై వందకు వందశాతం నమ్మకం ఉండబట్టేనంటున్నారు జగన్ అభిమానులు.