జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. స్వపక్షంలో విపక్షంలా మారి వైసీపీ నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఆధిపత్యపోరుకి దారి తీస్తున్నాయి. ఒక పక్క జమ్మలమడుగు మరో పక్క రాజంపేట వైసీపీ నేతల వర్గపోరు సొంత జిల్లాలో జగన్ కి కంట్లో నలుసులా మారాయి. జమ్మలమడుగు విభేదాలను పార్టీ పెద్దలు చక్కబెట్టేలోపే రాజంపేట వైసీపీలో వివాదాలు అధికారపార్టీలో కాక రేపుతున్నాయి.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ రాజకీయాలు సైలెంట్‌గా కనిపించినా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. 2019 ఎన్నికల ముందు వరకు ఆయన టీడీపీ నేత. వైసీపీలోకి మేడా రాకను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వ్యతిరేకించారు. అప్పట్లో అధిష్ఠానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. ఆకేపాటికి కాకుండా మేడాకు టికెట్ ఇవ్వడం.. ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇద్దరి మధ్య గ్యాప్ చాలా వచ్చిందన్నది పార్టీ వర్గాల టాక్. మండల, గ్రామ స్థాయిల్లోని వారి అనుచరుల మధ్య విభేదాలు రాజంపేటలో బలమైన విపక్షం లేదన్న లోటును వైసీపీలోని ఈ రెండు వర్గాలు తీర్చేస్తున్నాయని వైసీపీ కేడర్ చర్చించుకుంటుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మేడా, ఆకేపాటి వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచింది. బరిలో టీడీపీ పోరు నామ్‌కే వాస్తేగా మారినా.. వైసీపీలోని రెండు వర్గాలే హోరాహోరీగా తలపడ్డాయి. నియోజకవర్గంలోని మొత్తం 6 మండలాల్లో అధికార పార్టీ శ్రేణుల మధ్యే పోటీ జరిగిందని ఇప్పటికీ కథలు కథలుగా చెబుతున్నారు. ఇప్పుడు రెండు వర్గాల మధ్య విభేదాలు శ్రుతిమించి కాంట్రాక్టులు, భూ సెటిల్మెంట్ల విషయంలో ఘర్షణ పడటం.. కేసులు పెట్టుకోవడం వరకు వెళ్లింది. ప్రెస్మీట్లు పెట్టి ఓపెన్‌గానే ఒకరినొకరు దూషించుకుంటున్నారు.
ప్రతి పనీ, కాంట్రాక్టు తమకంటే తమకే కావాలని పోటీపడటం వల్ల పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న వారికి అన్యాయం జరుగుతోందని ఒకరు.. మొన్నటికి మొన్న పార్టీలోకి వచ్చిన వారికి న్యాయం చేస్తున్నారని ఇంకొకొరు విమర్శలు చేసుకోవడం రాజంపేట వైసీపీలో కాక రేపుతోంది. ఇలా రోజూ కేడర్ తీసుకొస్తున్న సమస్యలు నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందట. రాజంపేట ఆధిపత్య పోరుకు పార్టీ పెద్దలు ఎలా చెక్ పెడతారో చూడాలి.