Home Entertainment Cinema

‘యాత్ర’ కర్త,కర్మ,క్రియా జగన్మోహనుడేనా…?

జననేతగా తెలుగు వారి గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ బయోపిక్‌గా ప్రచారం పొందిన ‘యాత్ర’ నిజానికి పూర్తి బయోపిక్‌ కాదు. వైఎస్‌ఆర్‌ జీవితంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని మాత్రమే చూపిస్తుందీ చిత్రం. అలాగని ఆ ఘట్టాన్ని యథాతథంగా వాస్తవాలకి దగ్గరగా చూపించడం కాకుండా… వాస్తవ పాత్రలు, సంఘటనలకి సినిమాటిక్‌ డ్రామా జోడించి… వైఎస్‌ఆర్‌ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. వైఎస్ జీవితంలో కొన్ని పాత్రలకు మాత్రమే ప్రాధన్యత ఇస్తూ సాగిన ఈ యాత్రలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముద్ర ఎంత…ఈ సినిమా కి కర్త,కర్మ,క్రియ ఆయనేనా….

సినిమాలో పాత్రల సరళిని పరిశీలిస్తే ఏ పాత్ర కి ఎలాంటి ప్రాధ్యాన్యత ఇవ్వాళి అన్నది వైసీపీ క్యాంప్ నుంచే సిగ్నల్స్ వెళ్లినట్టు తెలుస్తుంది. కేవీపీ పాత్రకి ఇచ్చిన ప్రాధాన్యత, సూరీడు పాత్రకి ఉన్న ప్రాధాన్యత తగ్గించి మరో వ్యక్తి రూపంలో ఆ పాత్రకి జీవం పోసిన తీరు చూస్తుంటే ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ తో యాత్రని తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. ‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి పాత్రతో సముచిత స్థానం కల్పించిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది కేవీపీ పాత్ర. వైఎస్ ఆత్మ కేవీపీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని ‘యాత్ర’ సినిమాలోనూ బలమైన సీన్లతో ప్రజెంట్ చేశారు. ఇక వైఎస్ తోడు నీడగా ఉండే సురీడు పాత్రకు సెన్సార్ కట్లు వేసి ఆ పాత్రని మరో వ్యక్తి రూపంలో ఆ ఎమోషనల్ ఎటాచ్ మెంట్ చూపించారు. ఏ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అది సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతుంది.

‘గెలవడం అసాధ్యం’ అనే లెవల్‌ నుంచి ఆయన ఎలా గెలిచారు అనేది యాత్ర సినిమా ఫోకస్‌ చేస్తుంది. ఆయన ప్రకటించిన ప్రతి ప్రజా సంక్షేమ పథకం వెనుక ఎలాంటి కారణాలు ఆయనని ప్రేరేపించి వుంటాయనేది దర్శకుడు మహి వి. రాఘవ్‌ తన ఆలోచనలతో డ్రామా నింపి వాటిని కథనంలో భాగం చేసాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం నిజానికి మంచి ‘బయోపిక్‌’ మెటీరియల్‌గా పనికొస్తుంది. కానీ అదంతా వదిలేసి ‘పాదయాత్ర’ని హైలైట్‌ చేసి, దాని మీదే పూర్తి సినిమా తీయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఏమాత్రం పట్టు తప్పినా అటు పొలిటికల్‌ ప్రాపగాండా సినిమాగానో, లేదా ఇటు ఒక నీరసమైన డాక్యుమెంటరీగానో మిగిలిపోయే ప్రమాదం వున్న కాన్సెప్ట్‌ ఇది.

నిజానికి వైఎస్ భార్య విజయమ్మ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ ఇవ్వలేదు ఈ సినిమాలో. కాని ఉన్నంతలో వైఎస్ భార్య విజయమ్మ పాత్రలో అశ్రిత మెస్మరైజ్ చేసింది. విజయమ్మ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక సినిమాలో పోసాని క్యారక్టర్లో లగడపాటిని చూపించారన్న టాక్ వినిపిస్తొంది. లగడపాటి టీడీపీ ఇన్ ఫార్మర్ గా కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత వైఎస్ కి అనుచరుడిగా మారినట్లు చూపించారు. ఇక కాంగ్రెస్ అనే పదానికి పరిధికి మించి ప్రాధాన్యత ఇవ్వకుండా పిడికిలి గుర్తుని ఫోకాస్ చేసి కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని ప్రివిలైజ్ చేశారు.

వైఎస్ఆర్‌గా లీడ్ రోల్ పోషించిన మమ్ముట్టి పాత్ర కోసం ప్రాణం పెట్టడం ఏంటో ఆయన నటన ద్వారా నిరూపితం చేశారు. వైఎస్ పాత్రలో ఒదిగిపోయారు. జాలి, ప్రేమ, కరుణ, దయ, పొగరు, లాంటి ఎమోషన్స్ పలికించడమే కాకుండా కొన్ని ఎమోషన్ సీన్లలో కళ్లతో నిర్ణయం చేయడం ఎలాగో చూపించారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ పథకం పురుడు పోసుకోవడానికి దర్శకుడు ఎంచుకున్నహాస్పిటల్ సీన్‌లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. 15 నిమిషాలు పాటు సాగిన ఆ సీన్‌లో కళ్లు చెమర్చని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తికాదు. అంతలా హార్ట్ టచ్చింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు మమ్ముట్టి. ‘ఈ వయసులో ఏ పనీ చేయలేక.. మా పని మేం చేసుకోలేక.. చావలేక బతకలేక మా లాంటి ముసలోళ్ల కోసం ఏదైనా మంచి పనిచేయయ్యా..’ అని ఓ అవ్వ దీనంగా వైఎస్‌ను అడగటం.. ఆమె మాటలకు చలించిపోయిన వైఎస్.. కళ్లతోనే హావభావాలు పలికిస్తూ ఆ అవ్వను దగ్గరకు తీసుకుని భరోసా ఇచ్చిన సీన్ సూపర్ అని చెప్పవచ్చు. ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలతో ‘యాత్ర’ జర్నీ సాగింది.

వైఎస్ పాత్రకు మమ్మట్టిని… విజయమ్మ పాత్రకు అశ్రితను.. కేవీపీ పాత్రకు రావు రమేష్‌ని.. రాజారెడ్డి పాత్రకు జగపతిబాబుని.. సబితా ఇంద్రారెడ్డి పాత్రకు సుహాసినిని.. ఇలా ప్రతి పాత్ర ఎంపికతో ఆయా పాత్రలకు జీవం పోసేలే బలమైన సీన్లు రాశారు దర్శకుడు మహీ. పాదయాత్రలో సన్నివేశాలు ప్రాంతాలవారి సమస్యల కోణంలో చూపిస్తే ఇంకా అద్భుతంగా ఆగేది. అయితే ఈ చిత్రాన్ని టోటల్‌గా వన్‌సైడెడ్‌గా తీసేయడం, రాజశేఖరరెడ్డిలోని నెగెటివ్స్‌ని అన్యాపదంగా మాత్రమే ప్రస్తావించడం, ఆయన గతం జోలికి గానీ, తనపై వున్న ఆరోపణల వైపు కానీ వెళ్లకపోవడం అందర్నీ మెప్పించలేకపోవచ్చు. ముఖ్యంగా హైకమాండ్‌ని కమాండ్‌ చేసే నాయకుడన్నట్టు చూపించడం, ఆయన ఏనాడూ పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయలేదన్నట్టుగా చిత్రీకరించడం సినిమాటిక్‌గా వైఎస్‌ని ఎలివేట్‌ చేయడానికి ఉపయోగపడినా కానీ వాస్తవాతీతంగా అనిపిస్తుంది. అయితే సదరు సన్నివేశాల్లో వైఎస్‌ డైనమిజమ్‌ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here