Home Entertainment Cinema

పవన్ కళ్యాణ్ తో ఫ్లాప్ హీరోయిన్ నటించబోతుందా..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఒకవైపు పింక్ సినిమా రీమేక్ పనులతో.. మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ తో.. ఇంకోవైపు రాజకీయాలు చేస్తూ అసలు గ్యాప్ లేకుండా దుమ్ము దులుపుతున్నాడు పవర్ స్టార్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఆయనతో నటించే హీరోయిన్ల వివరాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఆయన సినిమా చేస్తున్నాడు అనే ఆనందంలో అభిమానులు కూడా ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ముందుగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న పింక్ సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్ ఎవరో కన్ఫామ్ కాలేదు. మిగిలిన పాత్రలకు నివేదా థామస్ తో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలను తీసుకున్నారు. కానీ పవన్ తో ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇద్దరు కలిసి నటించిన అజ్ఞాతవాసి సినిమా చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ అయ్యింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా 2018 సంక్రాంతి వచ్చింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన జాబితాలో బాంబే వెల్వెట్, స్పైడర్ సినిమాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది అజ్ఞాతవాసి. అంత దారుణమైన సినిమాలో నటించిన కీర్తి సురేష్ కు ఇప్పుడు తన సరసన మరోసారి అవకాశం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్.

సాధారణంగా పవన్ హీరోయిన్ విషయంలో పెద్దగా పట్టుపట్టడు. తనకు హీరోయిన్ కావాలి అంటూ నోరు తెరిచి అడగలేడు పవర్ స్టార్. సెంటిమెంట్లు కూడా అస్సలు పట్టించుకోడు. అలా పట్టించుకుంటే అప్పటివరకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇవ్వడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కీర్తి సురేష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంత పెద్ద డిజాస్టర్ సినిమాలో నటించిన తర్వాత మరోసారి ఈమెతో రొమాన్స్ చేయబోతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా సినిమాతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కీర్తి సురేష్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫర్ కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here