టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు అని నిన్నటి నుంచి రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన చేరికకు టీఆర్ఎస్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీ నేతగా పేరున్న ఎల్ రమణను పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. రమణకు,ఈటలకు మధ్య పోలికేంటి అన్నది గులాబీ పార్టీ నేతలకే అంతుబట్టడం లేదు. రమణకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి చేర్చుకోవాల్సిన అవసరం ఉందా అన్న చర్చ మొదలైంది.

ఎల్ రమణ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నేత. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఈయన జగిత్యాల నియోజకవర్గం నుంచి నేతగా ఎదిగారు. కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యనేతగా ఉన్నారు. టీడీపీలో కీలకనేతలంతా టీఆర్ఎస్ బాట పట్టడంతో రమణను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చంద్రబాబు నియమించారు. ఇక రమణకి టీ టీడీపీ నేతల పై ఉన్న పట్టు అంతంతమాత్రమే. రమణ ను అవుట్ డేటెడ్ లీడర్ గా టీఆర్ఎస్ నేతలే అభివర్ణిస్తున్నారు. ఆయన ప్రజలను మర్చిపోయి చాలా కాలం అయిందంటున్నారు.
ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ తరుపున పోటి చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అటువంటి ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ పార్టీలోకి తీసుకురావడ పై సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ కావడంతో అసంతృప్తి ఉన్న నేతలెవ్వరు నోరు మెదపడం లేదు.