Home News Stories

పశ్చిమలో వైసీపీకీ దిక్కెవరు….?

పశ్చిమగోదావరిజిల్లా వైయస్సార్ పార్టీ పరిస్థితి అయోమయం గందరగోళంగా తయారయింది. గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయిన వైయస్ఆర్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో పరువు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఇప్పటికి చాలా చోట్ల ఏమాత్రం క్లారిటీ లేకపోవడంతో అటు నాయకులు, ఇటు క్యాడర్ ఫుల్ కన్యూఫ్యూజన్లో మునిగిపోయింది. నియోజకవర్గాల్లో నెలకొక కొత్త ఇంచార్జ్ తెరపైకి వస్తుండటంతో ఈసారి ఎన్నికల్లో కూడా పశ్చిమలో పార్టీ పట్టు సాధిస్తుందా అన్న డౌట్ ఇప్పుడు నాయకుల్లో గుబులుపుట్టిస్తుంది. కార్యకర్తలు కూడా పార్టీ అధినేత జగన్ పైనే భారం వేసి ఊసురుమంటున్నారు.

వైయస్సార్ పార్టీకి గత ఎన్నికల్లో ఓటమిపాలైన విషయం ఒక ఎత్తైతే.. అధికారం అందకపోవడానికి ప్రధాన కారణం మాత్రం పశ్చిమగోదావరి జిల్లా అనే చెప్పాలి. కొమ్ములు తిరిగిన నేతలుగా చెప్పుకొని తిరిగే నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గత ఎన్నికల్లో సత్తాచాటలేకపోయారు. అంచనాలకు మించిన ఆశలతో ఎన్నికల్లో ఊహించని విదంగా బోర్లాపడటంతో గత ఎన్నికల్లో వైయస్సార్ పార్టీకి ఒక్కటంటే ఒక్కసీటుకూడా దక్కలేదు. దీనికి కారణాలు అనేకం. జిల్లా ఎంపిక చేసిన నేతల్లో చాల మంది క్యాడర్ కు అందుబాటులో ఉండకపోవడం, ఎన్నికల కంటే ముందే అధికారంలో ఉన్నట్టుగా జనాన్ని దూరం పెట్టడం వారికి పెద్ద మైనస్ అయ్యింది. జిల్లాలో జగన్ పార్టీకి మంచి ఇమేజ్ ఉన్నప్పటికి స్థానికంగా ఎంపిక చేసిన నేతలు జగన్ కంటే పెద్ద బాస్ లుగా వ్యవహారాలు చేయడంతో పశ్చిమలో ప్రజలు వైసిపిని పక్కన పెట్టారు.

నియోజకవర్గాల వారీగా చూస్తే అంతా జగన్ చూసుకుంటారు మేము పోటిలో నిలుచుంటే చాలనేది పశ్చిమలో వైసీపీ నేతల తీరు. చింతలపూడి, భీమవరం, కొవ్వూరు, ఉంగుటూరు,పాలకొల్లు, దెందులూరు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల కన్వీనర్లుగా ఉన్న వ్యక్తులు జనంలోకి పూర్తి స్థాయిలోకి వెళ్ళలేక పోతున్నారు. టీడీపీ కంచుకోటగా మారిన పశ్చిమలో అధికార పార్టీ పై పీకలదాకా కోపంతో ఉన్నా దాన్ని క్యాష్ చేసుకుని పక్కాగా మేం గెలుస్తామని ధీమాగా చెప్పగలిగే నాయకులు కనిపించడంలేదు. ఎన్నికల కంటే ముందు నుంచే కన్వీనర్లుగా ఉన్నప్పటికి చివరి వరకు ఉంటామా లేదా అనేది చాలా మందిలో కొనసాగుతున్న అనుమానం. జిల్లా నుంచి ఎప్పటికప్పుడు జగన్ సొంతగా సర్వే రిపోర్టులు తెప్పించుకోవడం, మరోపక్క పీకే టీమ్ ఎప్పటికపుడు నాయకుల తీరు పై సమాచారం సేకరిస్తుండటంతో ఆపార్టీ గెలుపుగుర్రాలనే బరిలో దించాలనే ఫుల్ క్లారిటీతో ఉంది.

జన బలంతో పాటు ఆర్దికంగా ఓకే అన్న నేతలపైనే జగన్ పార్టీ ఫోకస్ పెడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటిచేసే అవకాశం ఎవరికి వస్తుంది, ఎవరికి మిస్సవుతుందనే క్లారిటీ లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఆపార్టీ నేతలు సత్తా చూపలేకపోతున్నారు. తీరా డబ్బులు ఖర్చు చేసుకుని చివరినిమిషంలో అవకాశాలు తారుమారైతే పరిస్థితి ఏంటని లెక్కలేసుకోవడం పార్టీకి మైనస్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అధికారంలోకి రావాలంటే పశ్చిమలో పాతుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు దేశం పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి వైసీపీ అవకాశం లేకుండా చేయడంతో అప్పటి నుంచి పార్టీ నేతలు చాలా నియోజకవర్గాల్లో అందుబాటులో లేకుండా పోయారు. ఇందులో దెందులూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం,నిడదవోలు ఇలా చాలా చోట్ల కార్యకర్తలను పట్టించుకునే దిక్కులేకుండా పోవడం ఆపార్టీని మరింత దెబ్బతీసింది. తాజాగా కన్వీనర్లుగా ప్రకటించిన నేతలు చేస్తున్న యాత్రలకు అయ్యే ఖర్చును కింది క్యాడర్ పై వేయడంతో వారు ఆర్ధికంగా మరింత నష్టపోతున్నామనే భావనలో ఉన్నారు.

మరికొంత మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎన్నికల సమయానికి చూసుకొవచ్చే దోరణితో కనిపిస్తున్నారు. గతంలో టీడీపీకి అండగా నిలిచిన జనసేన కూడా ఒంటరిపోరుకు సిద్దమవ్వడంతో ఇదేమంచి చాన్స్ అంటుంది కిందిస్థాయి క్యాడర్.వాస్తవానికి పశ్చిమలో టీడీపీని ఎదుర్కొడానికి వైసీపీ కి వచ్చిన మంచి టైమ్ ఇదే అనేది పార్టీ కార్యకర్తలు, నేతల మాట. అయితే ఒక పక్క ఆర్ధిక ఇబ్బందులు మరోపక్క టిక్కెట్ కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆశావాహులు సైతం స్పీడ్ పెంచలేకపోతున్నారు. ఎన్నికలకు మరో నెలన్నర సమయం ఉండటంతో ఇప్పటికైనా నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ప్రకటన చేస్తే పశ్చిమలో పార్టీ కొంతమేర పుంజుకొంటుందని ఎదురుచూస్తుంది పశ్చిమ వైసీపీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here