Home News

హేమాహేమీల్లాంటి ఆ టీడీపీ నేతలు ఏమైయ్యారు?

పశ్చిమగోదావరి జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన జిల్లా. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2019 నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలే గెలిచారు. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లోనే సైకిల్‌ నిలబడింది. దీనికితోడు రాష్ట్రంలో టీడీపీ పవర్ కోల్పోవడంతో ఆ ఎఫెక్ట్‌ జిల్లాపైనా కనిపించింది. అప్పట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కనుసైగతో జిల్లాను శాసించిన వారు ఒక్క ఓటమితో గప్‌చుప్‌ అయ్యారు. హేమాహేమీల్లాంటి టీడీపీ నాయకులు అనుకున్నవారు సైతం ఏమైపోయారో తెలియని పరిస్థితి నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం నడిపించే నాయకులు లేడన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట. పంచాయతీలు పోయాయి. మున్సిపాలిటీలలో ఒకటి రెండు వార్డులకే పరిమితమైన దుస్థితి నెలకొంది. ఇక పరిషత్‌ ఎన్నికల సరేసరి. జిల్లాలో వైసీపీ ఎత్తుగడల ముందు టీడీపీ నేతల వ్యూహాలు తేలిపోతున్నాయి. ఎదురు నిలబడటం కాదు కదా.. ఎదురు మాట్లాడే పరిస్థితి లేదు. జిల్లా నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. మరో మాజీ మంత్రి జవహర్‌ కొవ్వూరులో మళ్లీ కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారు. ఇద్దరూ ఉన్నారంటే ఉన్నారు అంతే. యాక్టివ్‌గా లేరు. పార్టీ పదవులు అనుభవిస్తున్న వీళ్లు అసలు యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్నారా అన్న అనుమానాలు కేడర్‌లో ఉంది.

పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అది కూడా పాలకొల్లుకే పరిమితం. రాష్ట్రస్థాయిలో నిమ్మల పేరు వినిపిస్తున్నా.. జిల్లాలో మాత్రం అంత సీన్‌ లేదన్నది తమ్ముళ్ల మాట. మరో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నా లేనట్టేనట. ఉండి నియోజకవర్గంలోనే ఆయన చప్పుడు చేయడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో మునుపటి దూకుడు లేదు. కేసుల వల్ల భయపడ్డారో ఏమో సైలెంట్‌ అయిపోయారు. చింతమనేని పరిస్థితిని చూసిన జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు మనకెందుకు వచ్చిన గొడవలే అని సర్దుకున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబుల అలికిడి లేదు. ఇదే విధంగా అధిష్ఠానం ఉంటే పార్టీ ఖాళీ కావడం ఖాయమనే ఆందోళనలో ఉంది కేడర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here