Home News Stories

గోదావరి జిల్లాలో రసవత్తర రాజకీయం…

ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పక్షాల్లో ఎత్తులు.. పైఎత్తులు. గోడ దూకేందుకు కొందరు, ఉన్నంతలో సీటు దక్కించుకునేందుకు మరికొందరు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో సామాజికవర్గాల వారీగా పార్టీలు తూకం వేస్తున్నాయి. గెలుపోటములపై ఎవరి అంచనాలు వారివి. ఆయా పార్టీల్లో మారుతున్న సమీకరణలతో గోదావరి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది.

టీడీపీ నుంచి ఏ నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా నిలపనున్నారో సస్పెన్స్‌. వైసీపీలో కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించినా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు చివరి వరకు కొనసాగుతారో, లేదో అనుమానం. జనసేన నుంచి ఊహించని అభ్యర్థులు రంగంలోకి దిగుతారంటూ ప్రచారం. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ తాజాగా దరఖాస్తుల స్వీకరణకు సమాయత్తమైంది.

గడచిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం, విజయాన్ని సొం తం చేసుకున్న టీడీపీ ఈసారి కూడా అవే ఫలితాలు పునరా వృతం అవుతాయనే ధీమాతో ఉంది. తాజాగా డీసీసీబి చైర్మన్‌ ముత్యాల వెంకటరత్నం తాను పోటీకి సిద్ధమేనని ఏకపక్ష ప్రకటన చేశారు. ఇప్పటివరకు తాడేపల్లిగూడెం నియోజక వర్గం నుంచి అవకాశం వస్తే పోటీకి వీలుగా రత్నం సమాయత్తంకాగా తాజాగా రకరకాల వదంతులు పుట్టాయి. దీంతో అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమేనని రత్నం ప్రకటించారు. బలమైన సామాజిక వర్గానికి చెంది న రత్నం మొదటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. కానీ ఏ నియోజకవర్గమో అధి ష్ఠానం తేల్చాలంటూ చేసిన ప్రకటన తెలుగు దేశం వర్గాలను విస్మయానికి గురిచేసింది.

సిట్టింగ్‌లకే అవకా శం ఎక్కువగా కనిపిస్తుండగా రత్నం ఏ ఉద్దేశంతో ఈ కామెంట్లు చేశారం టూ మరికొందరు వివాదానికి ఊతమిస్తున్నారు. పసుపు-కుం కుమ కార్యక్రమం నేతలను నియోజకవ ర్గాల్లో ఏకం చేసింది. ఇంతకుముందు పితాని సత్యనారాయణ కు మంత్రి పదవి ఇవ్వడంపై అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మనసు మార్చుకున్నారు. ఆయనను కలుపుకుపోయేందుకు సిద్ధపడ్డారు. మంత్రి పితానిని తన నియోజకవర్గం దెందులూరుకు ఆహ్వానించి పసుపు-కుంకుమ చెక్కులను అందించేలా జాగ్రత్తపడ్డారు. మరోవైపు నరసాపు రం నియోజకవర్గంలో కొన్నాళ్ల పాటు ఎడమొఖం పెడమొ ఖంగా ఉన్న ఎమ్మెల్యే మాధవనా యుడు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ సుబ్బారాయుడు గడచిన కొద్ది రోజులుగా పార్టీకి లోబడి సంయుక్తంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పసుపు-కుంకుమ కార్యక్రమంలో కలివిడిగా తిరిగారు. చాగల్లు మండలంలో మంత్రి జవహర్‌ వ్యతిరేకవర్గంగా ఉన్న కొందరు కాస్తంత తగ్గి ఆయనతో కలిసి పసుపు-కుంకుమ పంచారు.

విద్యా సంస్థల అధిపతి విష్ణురాజు హఠాత్తుగా జనసేనలో చేరారు. ఆయన చేరిక నరసాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలో సరికొత్త సమీకరణలకు దారితీయనుంది. విద్యా వేత్తగా విష్ణురాజుపై ఒకింత సానుకూలత ఉంది. ఇది కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను నేరుగా ప్రభావితం చేయనుందని జనసేన ఆశిస్తుంది. దీనికి తగ్గట్టుగానే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి విష్ణురాజును బరిలోకి దింపే ఆలోచన లేకపోలేదని మరో సమాచారం. పార్టీ అధి నేత పవన్‌కల్యాణ్‌, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మధ్య కీలక చర్చలు జరిగిన తరువాతే విష్ణురాజు పార్టీలో చేరారు. దీంతో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి విష్ణురాజుకు బదులుగా మరొకరి పేరు ప్రచారం లో ఉన్నా అదేదీ నిజంకాదనేది తేలిపోయింది.

వైసీపీలో మొదటి నుంచి కొందరు కన్వీనర్లది ఇప్పటికీ అభద్రతా భావమే. చింతలపూడిలో పార్టీ కన్వీనర్‌ ఎలేజాను మార్చాలంటూ సీనియర్‌ నేత ఘంటా మురళీ పట్టుపడు తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం. దీనిపై ఘంటా మురళీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే కేడర్‌ ఉంది.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనేదే మురళీ వాదనగా కనిపిస్తుంది. దీనికితోడు ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పార్టీ కన్వీనర్ల మార్పు ఉండవచ్చుననే ప్రచారం ఊపందుకుంది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌గా ఎవరినీ నియమించలేదు. దీనిపై పార్టీలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి తగిన స్తోమత కలిగిన అభ్యర్థి లభించలేదని చెబుతుండగా పార్టీ అధ్యక్షుడు జగన్‌ వ్యూహం త్వరలోనే తేలబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

క్షేత్రస్థాయిలో బలపడి, మిగతా పార్టీలతో తలపడాలని బీజేపీ భావిస్తోంది. దీనికనుగుణంగానే ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురికి తగ్గకుండా ఇప్పటికే ఆశావహుల పేర్లను సిద్ధం చేసింది. తగిన సమయంలో వడపోత ఆరంభమవు తుందని కమలనాథులు చెబుతున్నారు. కొన్ని నియోజకవ ర్గాల్లో వీరి ఎంపిక భవిష్యత్తులో బలమైన పోటీకి దారితీసే అవకాశం లేకపోలేదు. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం నింపాదిగా తన పని తాను చేసుకుపోతోంది. ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు లను ఆహ్వానించింది. పాలకొల్లు, ఏలూరుసహా కొన్ని నియోజకవర్గాల్లో ఆశావహుల మధ్య పోటీ ఉండే అవకాశం లేకపో లేదు. కొన్నింట ఒకపేరు మాత్రమే ఇప్పటికీ వినిపిస్తుంది.