Home News Updates

ఓరుగల్లులో భగ్గుమంటున్న హస్తంలో అసమ్మతి….

కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి రాజుకుంది. తొలి, రెండో విడత జాబితాల్లో టికెట్లు దక్కని ఆశావహులు తిరుగు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై అనుచరులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పార్టీని నమ్ముకుంటే తీవ్ర అన్యాయం చేసిందని ఆశావహులు సెగలు కక్కుతున్నా వాటిని చల్లార్చే ప్రయత్నాలే కరువయ్యాయి.

మహాకూటమి పొత్తులపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన స్క్రీనింగ్‌ కమిటీ, ప్రకటన తర్వాత మాత్రం ఎవరి దారిన వారిని వదిలేశాయి. దీంతో ఆశావహులంతా కొందరు ఇండిపెండెంట్లుగా, కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ లోనే నేతల మధ్య తీవ్ర పోటీ ఉండగా కూటమి పార్టీలకు సీట్ల కేటాయింపుతో అది పీక్స్ కి చేరింది.

వరంగల్‌ పశ్చిమ సీటు టీడీపీకి కేటాయించడంతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖాలు చేశారు. ఇదే బాటలో మరి కొందరు నాయకులున్నారు. వరంగల్‌ పశ్చిమలో మాజీ మేయర్‌ స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ఇతర ఆశావహులు నిరాశలో ఉన్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు టీడీపీ అభ్యర్థి రేవూరి కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిస్తుంది.

ఇక స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థిగా ఇందిర పేరు ప్రకటించడంతో మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, అమృతరావు తదితరులు భగ్గుమంటున్నారు. రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు విజయరామారావు ఇప్పటికే సిద్ధమయ్యారు. ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు భద్రాచలం సీటు ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లడానికి సానుకూలంగా లేరు ఈ విషయం పై ఒకటి రెండురోజుల్లో స్పష్టత రానుంది.

మహబూబాబాద్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ సహాయ మంత్రి బలరాంనాయక్‌ పేరు ఖరారు చేశారు. ఈ సీటు కోసం ఆశలు పెట్టుకున్న వారిలో ఒకరిద్దరు పార్టీ మారే అవశాలున్నాయని సమాచారం. పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి పేరు మొదటి జాబితాలోనే విడుదల చేశారు. ఇక్కడి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌రావు కుటుంబం, బిల్లా సుధీర్‌, మరో ఇద్దరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు.

పరకాల సీటు కొండా సురేఖకు ఖరారు కావడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డి డీలా పడిపోయారు. నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇదేనా గుర్తింపు అని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరంగల్‌ తూర్పు సీటు జనసమితికి ఇవ్వొద్దని, స్థానికులకు టికెట్‌ ఇవ్వాలని ఆశావహులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి విన్నవించేందుకు అచ్చ విద్యాసాగర్‌ ఢిల్లీ వెళ్లారు. టికెట్‌ ఇవ్వకపోతే రెబల్‌గా బరిలోకి దిగుతానని ఇప్పటికే మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పోశాల పద్మ ప్రకటించారు. ఇక సీటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

వర్ధన్నపేట స్థానాన్ని జనసమితికి ఇవ్వొద్దని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, బక్క జడ్సన్‌, నమిండ్ల శ్రీనివాస్‌ తదితరులు అధిష్ఠానం పెద్దలను కలిశారు. ఇక జనగాం సీటు విషయంలో మరిత రచ్చ నడుస్తుంది. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకే టిక్కెట్ రాకపోవడంతో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ అవాక్కయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here