Home News

ఆ ఎమ్మెల్యే మంగమ్మ శపథం పార్టీ పుట్టి ముంచనుందా…!

ఆయనో సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే … గెలిచిన తర్వాత మంగమ్మ శపథం కంటే గట్టి ఒట్టే పెట్టుకున్నారు. ఆ ఆఫీసు గడప తొక్కనంటే తొక్కనని భీష్మించుకుని కూర్చున్నారు … తానే కాదు తన అనుచరులను అటువైపు కన్నెత్తి చూడొద్దని హుకుం జారీ చేశారు… దీంతో మొరాయించిన ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది ఆ ఆఫీసు యంత్రాంగం …స్టీల్ సిటీలో‌ ఆ ఎమ్మెల్యే ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారారు….

ఎవరికి వారే ఎమునకు తీరే అన్నట్టుగా తయారైంది విశాఖపట్నం తెలుగుదేశంలో పరిస్ధితి… బలమైన నాయకత్వం వున్న చోట అంతర్గత కుమ్ములాటలు సమస్యగా మారుతున్నాయ్… అర్బన్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహ్మాన్… విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది… కొద్ది నెలలుగా ఈ ఇద్దరు నేతలు ఎడమొహం … పెడమొహంగా వుంటున్నారు… అర్బన్ పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డుమ్మా కొడుతున్నారు… ఇక, పార్టీ పరంగా ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలకు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి పిలుపు వుండటం లేదు.

ఎన్నికల్లో ఓటమి… కార్యకర్తలపై దాడులను ఎదుర్కోవడం… ఎన్టీఆర్ భవన్ నిర్మాణం అక్రమమని జీవీఎంసీ నోటీసులు జారీ చేయడం సహా వివిధ అంశాలను విశ్లేషించి… అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ పరంగా మూడు సమావేశాలు జరిగాయి. త్రిసభ్య కమిటీ వచ్చి పరిస్ధితులను చర్చించి వెళ్ళింది.. ఈ మూడు మీటింగులకు మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటాశ్రీనివాస్, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు హాజరయ్యారు… ఎన్నికల ముందు పార్టీలో చేరిన మాజీ ఎంపీ సబ్బం హరి సైతం పాల్గొన్నారు. ఇన్ని జరుగుతున్నా… ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తైనా చూడలేదు…

ఇలాంటి పరిస్థితుల్లో వాసుపల్లితో తాడోపేడో తేల్చుకోవాలని రెహ్మన్ భావిస్తున్నారట… ఈ తరహా వ్యవహారశైలి వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్న ఆయన… పార్టీ నియమావళికి లోబడి ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం.‌ పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీలక సభ్యత్వం కలిగిన వారు .. పార్టీ ఆఫీసులో వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే నోటీసులిచ్చేందుకు అవకాశం వుంది. దీనిని ఆధారంగా చేసుకుని ముందు ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడం…. ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధినేత దగ్గర పంచాయితీ పెట్టాలన్నది అర్బన్ పార్టీ అధ్యక్షుడి ఆలోచనగా చెప్తున్నారు …

సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంనుంచి తమకు టిక్కెట్ కేటాయించాలని ఒక వర్గం రోడ్డెక్కింది… మైనార్టీలు అధికంగా వున్నా… సరైన ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ వారికి మద్దతుగా గళం విప్పారు… తమకు దక్షిణ నియోజకవర్గంపై వున్న పట్టు ఆధారంగా ఓ దశలో రెహ్మాన్ తన సతీమణిని ఇండిపెండెంట్ గా బరిలోకి దించేందుకు సిద్దమయ్యారు.. ఈ పరిణామాలతో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం…. ఇద్దరిని పిలిచి బుజ్జగించింది. అప్పటికే ఏడేళ్లు అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వాసుపల్లిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది… సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లికి తిరిగి టిక్కెట్ ఇవ్వడంతో పాటు ఎస్.ఎ.రెహ్మాన్ కు అర్బన్ పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా సమస్యను పరిష్కరించింది…

అయితే ఎన్నికల్లో వైసీపీ, జనసేనల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు.. వాసుపల్లికి 3,729 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది… అయితే అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా… ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజలతో వుంటూ ఐదేళ్ళు కష్టపడి పనిచేసిన తనకు మెజార్టీ తగ్గిపోవడానికి పార్టీలో వ్యక్తులే కారణమని వాసుపల్లి అనుమానిస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించి వాపోయారంట … ఈ నేపథ్యంలోనే అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా రెహ్మాన్ వున్నంత కాలం పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టబోనని ఎమ్మెల్యే వాసుపల్లి శపథం చేశారట. ఆయనే కాదు అనుచరులు అటువైపు కన్నెత్తి చూడొద్దని నియంత్రించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి…

తెలుగుదేశంపార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురైనప్పటికీ… విశాఖ నగరంలో ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయి. గ్రేటర్ పరిధిలోని నాలుగు కీలకమైన స్ధానాలను టిడిపి కైవసం చేసుకుంది… ఎమ్మెల్యేల అండదండలతో త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో జయభేరి మోగించాలని టీడీపీ శ్రేణులు ఉవ్విళ్ళూరుతున్నాయి .. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే, అర్బన్ పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి, రెహ్మాన్ల మధ్య వివాదం లేఖలు వరకూ వెళ్తే జీవీఎంసీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఎలా‌ ఉంటుందో‌ అన్న ఆందోళన‌ పార్టీ శ్రేణుల‌ నుంచి వ్యక్తమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here