Home News Politics

ఆ పార్లమెంట్ సీటు చాలా హాట్ గురు…!

రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే విశాఖ నియోజకవర్గానిది మరో ఎత్తు… ఉద్దండులు నెగ్గిన ఈ స్థానంలో ఎన్నికల నాటికి ఏ పార్టీ తరపున ఎవరు బరిలో ఉంటారు? ..ఫ్యామిలీ ఈక్వేషన్లతో పాటు.. క్యాస్ట్‌ కార్డు కూడా కీలకం కానున్న ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల అధినేతలు ఏ లెక్కలు వేసుకుంటున్నారు?.. బహుముఖ పోటీ అనివార్యమైన విశాఖ పార్లమెంట్‌ సెగ్మెంట్లో పోటీపై ప్రధానపార్టీల కసరత్తు పీక్స్ కి చేరింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది విశాఖ పార్లమెంట్ సీటు శీతాకాలంలోనే
సెగలు పుట్టిస్తుంది.

విశాఖపట్టణం పార్లమెంట్ నియోజకవర్గం … ప్రభావిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్… రాష్ట్రంలోని 25 లోక్ సభ సీట్లలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటిలో ముందు వరుసలో వుంటుంది… అధికశాతం స్ధానికేతరులే ఇక్కడి నుంచి ఢిల్లీ సభలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు… గత చరిత్రను చూసుకుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన రాజకీయ నేతలే ఇక్కడి నుంచి అత్యున్నత చట్ట సభలకు ఎన్నికై కీలక పదవులు కూడా చేపట్టారు … 2014 ఎన్నికల తర్వాత విశాఖ ఎంపీ సీటు మరింత కీలకంగా మారిపోయింది … ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది… అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి కంభం పాటి హరిబాబు అనూహ్య విజయం సాధించారు.

సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయంగా అన్ని పార్టీలకు విశాఖపట్టణం ఎంపీ స్ధానం అత్యంత కీలకంగా మారిపోయింది … ప్రతిష్టాత్మకమైన ఈ సీటు దక్కించుకోవడానికి ప్రధానమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది … బహుముఖ పోటీ జరగనుండటంతో అన్ని పార్టీలు గట్టి అభ్యర్ధిని బరిలోకి దించి .. ఆ సీటు దక్కించుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నాయి… వైసిపి తరపున ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ టిక్కెట్ ఆశిస్తున్నారు… ఎంపీ క్యాండెట్‌గా ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే నియోజక వర్గం స్ధాయిలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు…

బీజేపీ, జనసేనలు సైతం తమ వ్యూహాలను అమలు చేసేందుకు సంసిద్ధమౌతున్నాయి… ఈ తరుణంలో అసలు ప్రధాన రాజకీయపార్టీ అయిన తెలుగుదేశం ఎవరిని అభ్యర్ధిగా నిలుపుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది … ఎంపీ అభ్యర్ధి ఎవరనే దానిపై అధికార పార్టీలో ఉత్కంఠ రేగుతోంది. .. ప్రస్తుతం గీతమ్ యూనివర్శిటీ చైర్మన్, దివంగత సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి మనువడు ముతుకుమిల్లి శ్రీభరత్ పేరు విస్త్రతంగా ప్రచారంలో వుంది… రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీభరత్ పోటీ చేసేందుకు సంసిద్ధంగా వున్నారని…. ఆయన పేరును టీడీపీ అధినాయకత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నాయంటున్నారు…

శ్రీభరత్‌ కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుకు మనువడు… నందమూరి హీరో బాలకృష్ణకు స్వయానా అల్లుడు… మంత్రి నారాలోకేష్ కు తోడల్లుడు… దాంతో శ్రీభరత్ విశాఖ ఎంపీ సీటుకు ప్రధాన పోటీదారుడిగా ప్రచారంలోకి వచ్చారు .. ఇక్కడి వరకూ బానే వున్నా… చంద్రబాబు విశాఖ బరిలో ఎవరిని నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది… రాజకీయాల్లో కుటుంబ వ్యవహారాల కంటే పార్టీ విస్త్ర త ప్రయోజనాలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న అభిప్రాయం ఉంది … ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి బీసీల అండదండలు అవసరం… ఆయా వర్గాలను మరింత అక్కున చేర్చుకుని … వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలనే దిశగా టిడిపి అధిష్టానం కసరత్తు చేస్తోంది …

ఇప్పుడు విశాఖ ఎంపీ సీటు విషయంలోనూ సదరు బీసీ ఈక్వేషన్‌ తెరమీదకు రావచ్చంటున్నారు … బలమైన అభ్యర్ధి కోసం సెర్చింగ్‌లో ఉన్న చంద్రబాబు … ఎమ్మెల్యేల దగ్గర నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారని సమాచారం… ఆ క్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లాశ్రీనివాస్ పేరును ఎంపీ అభ్యర్ధిత్వానికి పరిశీలిస్తున్నారనే ప్రచారం విస్త్రతంగా జరుగుతోంది. .. యాదవ కులస్తుడైన శ్రీనివాస్‌ ఉన్నత విద్యావంతుడు… పైగా స్ధానికేతరులే ఎంపీలుగా ఎన్నికవుతున్నారని….దాని వల్ల విశాఖ ఆశించిన స్ధాయిలో అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోతుందనే ఆవేదన అందరిలోనూ వుండిపోయింది… రైల్వేజోన్ సహా కీలకమైన హామీలను నెరవేర్చుకోవడంలో ఎదురైన జాప్యం స్ధానికుల్లో అసహనాన్ని మరింత ఎక్కువ చేస్తోంది…

ఆ క్రమంలో స్ధానికుడైన బీసీ నేత పల్లా శ్రీనివాస్ ను తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రత్యర్ధులను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలనేది టిడిపి అధినేత ఆలోచనగా చెప్పుకుంటున్నారు. .. 2009 ఎన్నికల్లో పల్లాశ్రీనివాస్ ప్రజారాజ్యం అభ్యర్ధిగా విశాఖ ఎంపీ స్ధానానికి పోటీపడ్డారు. కాంగ్రెస్ నుంచి మాజీకేంద్ర మంత్రి పురంధేశ్వరి, టీడీపీ నుంచి ఎంవివిఎస్ మూర్తి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో పల్లాశ్రీనివాస్ సెకండ్ ప్లేస్ సాధించారు… విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాపులు, యాదవులు, మత్స్యకారులు, గవరలు, వెలమలు, ఎస్సీలు అధికశాతం వుంటారు. 2009ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ కు ఎస్.కోట, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ వచ్చింది.. దాంతో టీడీపీ అభ్యర్ధి కంటే సుమారు లక్ష ఓట్లు అధికంగా సాధించగలిగారాయన ..

2009, 2014ఎన్నికలతో పోలిస్తే విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్ధితి మరింత మెరుగుపడిందని టిడిపి నేతలు భావిస్తున్నారు … విశాఖ ఉత్తర నియోజకవర్గం మినహా మిగిలిన ఆరు సెగ్మెంట్లలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు… ఈ సారి స్ధానికులకు అవకాశం కల్పించడం….బీసీ సామాజిక వర్గానికి….అందునా ఓటర్ల సంఖ్య అధికంగా వున్న యాదవులకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఈ స్ధానాన్ని సునాయాశంగా గెలవాలనేది అధికారపార్టీ యోచనగా చెప్పుకుంటున్నారు… ఐతే, గాజువాక ఎమ్మెల్యేగా కంఫర్ట్ జోన్ లో వున్న తనను ఎంపీ అభ్యర్ధిగా పంపుతారనే ప్రచారాన్ని పల్లాశ్రీనివాస్ తోసిపుచ్చుతున్నారు. .. ఏదేమైనా లోకల్ ఫీలింగ్, బీసీ ఫ్యాక్టర్ ట్రంప్ కార్డ్ గా మారుతుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తే ఎంపీ అభ్యర్ధిపై స్పష్టత వస్తుందంటున్నారు తెలుగుతమ్ముళ్ళు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here