Home News Stories

విశాఖ వైసీపీలో టిక్కెట్లెవరికి…?

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులెవరనే దానిపై దాదాపు ఒక క్లారిటీకి వచ్చేసింది. అయితే విపక్ష వైసీపీలో మాత్రం పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల మినహా మిగిలిన స్థానాల్లో ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అంగబలం కంటే అర్థ బలానికే పార్టీ ప్రాధాన్యం ఇస్తుండడం, వ్యాపారులు, ఇతర పార్టీల్లో టిక్కెట్‌ ఆశించి, దక్కదని తేలిన నేతలు పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సమన్వయకర్తలుగా వున్నవారిని అయోమయానికి గురిచేస్తున్నది. రాష్ట్రాంలో అధికారం దక్కాలంటే విశాఖలో పట్టు సాధించాలన్న ప్రాధమికసూత్రన్ని వైసీపీ ఫాలో అవుతుందా లేదా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది….

జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు వుండగా వైసీపీ దాదాపు నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల పార్టీలో చేరిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు భీమిలి టికెట్‌ కేటాయించగా, ఎలమంచిలి నుంచి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, మాడుగుల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. మిగిలినచోట్ల అభ్యర్థులెవరనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రజల్లో బలం వున్నవారికి కాకుండా అధికార పార్టీ అభ్యర్థులను దీటుగా ఎదుర్కోవడానికి ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగలిగిన వారికి పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తుండడంతో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోననే భయం సమన్వయకర్తలలో అభద్రతాభావాం నిరంతరం వెంటాడుతూనే ఉంది.

నర్సీపట్నం టిక్కెట్‌ను గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పెట్ల ఉమాశంకర్‌గణేష్‌కు ఖాయమని భావించినప్పటికీ అంతకంటే ఆర్థికంగా పటిష్ఠంగా వుండే నేతలు పార్టీలోకి వస్తే పరిశీలించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాపతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని వంశీకృష్ణశ్రీనివాస్‌ గట్టిగా చెబుతున్నా… ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని కొట్టిపారేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. భీమిలి సమన్వయకర్తగా పనిచేసిన అక్కరమాని విజయనిర్మల లేదా ఆర్కే టౌన్‌షిప్‌ ఎండీ కొండయ్యల్లో ఒకరికి తూర్పు టిక్కెట్‌ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

దక్షిణ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ పీవీ రమణమూర్తి టిక్కెట్‌ తనకేనని గట్టి నమ్మకంతో వున్నప్పటికీ, గతంలో సమన్వయకర్తగా పనిచేసిన కోలా గురువులు నియోజకవర్గంలో తమ సామాజికవర్గం కీలకం కాబట్టి తనకు టిక్కెట్‌ ఇవ్వాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్‌ కూడా ఉత్తరం లేదా దక్షిణం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. దీంతో అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాకుండాపోయింది. ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజుకు టిక్కెట్‌ కేటాయిస్తారని అంతా భావించినప్పటికీ అధికార పార్టీ శాసనసభ్యుడొకరు తనకు ఉత్తరం టిక్కెట్టు ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని వైసీపీ అధిష్ఠానం వద్ద ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో చివరి నిమిషం వరకూ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి పేరును ప్రకటించకూడదని అధిష్ఠానం భావిస్తుంది.

పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు పోటీ ఎవరూ లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత ద్రోణంరాజు పశ్చిమ సీటు ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని తెలిపినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్థికంగా కాస్త మెరుగైన నేత కావడంతో అధిష్ఠానం కూడా ఆలోచనలో పడినట్టు సమాచారం. పెందుర్తి సమన్వయకర్త అదీప్‌రాజుకు ఆర్థిక పరిస్థితిపై ఇబ్బంది లేకపోయినా, అధిష్ఠానం మాత్రం దూకుడుగా వుండే నేత కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌ను తప్పించాల్సి వస్తే అతనికి లేదా టీడీపీ నుంచి వచ్చేందుకు సిద్ధపడుతున్న ఓ మాజీ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని అధిష్ఠానం అంచనాగా తెలుస్తుంది.

గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ, అనకాపల్లి సీటును త్యాగం చేస్తే తనకు పెందుర్తి లేదా గాజువాక ఇవ్వాలని గుడివాడ అమర్‌ కోరుతుండడంతో నాగిరెడ్డికి లైన్‌ క్లియర్‌ అవడం లేదు. అనకాపల్లికి ప్రస్తుతం ఫలానా వ్యక్తి అభ్యర్థి అనే పరిస్థితి లేదు. గుడివాడ అమర్‌ పెందుర్తి లేదా గాజువాక నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దాడి వీరభద్రరావు లేదా కొణతాల రామకృష్ణ కుటుంబాల నుంచి ఎవరైనా పార్టీలో చేరితే వారిని ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తుంది. పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావును కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుని పోటీలో నిలపాలని అధిష్ఠానం భావిస్తుంది. ఇక్కడ మాజీ పోలీస్‌ అధికారి పేరు కూడా వినిపిస్తుంది.

అరకులోయ నుంచి శెట్టి ఫాల్గుణతోపాటు మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు పోటీ పడుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాడేరు సమన్వయకర్త విశ్వేశ్వరరాజు పాడేరు టిక్కెట్‌ తనదే అన్న ధీమాతో వున్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మి, మరో మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి కూడా పాడేరు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ ఎంపీ టిక్కెట్‌ను ప్రముఖ బిల్డర్‌ ఎంవీవీ సత్యనారాయణకు ఖాయమని పేర్కొంటున్నప్పటికీ, ఎంపీ విజయసాయిరెడ్డి మేనల్లుడు లేదా విశాఖ నుంచి ఎంపీగా పనిచేసిన మరొక మహిళానేత పేరు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ను వరుదు కల్యాణి ఆశిస్తున్నప్పటికీ ఇటీవల పార్టీలో చేరిన శరగడం చిన్నఅప్పలనాయుడు కూడా టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. అధిష్ఠానం మాత్రం మరింత సమర్థుడైన అభ్యర్థి కోసం గాలిస్తున్నది. అరకు ఎంపీ అభ్యర్థిగా పరీక్షిత్‌రాజు పేరు వినిపిస్తున్నప్పటికీ పోటీకి ఆయన విముఖంగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here