విశాఖకి ఆయువుపట్టులాంటి నియోజకవర్గం విశాఖ పశ్చిమ నియోజకవర్గం. ప్రతిష్టాత్మకమైన విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. సమకాలీన రాజకీయాలపై విస్తృతమైన అవగాహన ఉన్న ప్రాంతం విశాఖ పశ్చిమ. ఇక్కడి రాజకీయాలను పరిశీలిస్తే టీడీపీ,వైసీపీతో పాటు జనసేన కూడ కీలకమే. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి నేతల కొరత పీడిస్తోంది. సిట్టింగ్‌లు మినహా ద్వితీయ శ్రేణిలో శాసనసభ టిక్కెట్‌కు పోటీ పడే స్థాయి ఉన్న నాయకులు కనిపించడం లేదు. దాదాపుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలదీ ఇదే పరిస్థితి. ఈ సారి కొత్తగా రంగంలోకి వచ్చిన జనసేనకు మాత్రం ఇద్దరు ముగ్గురు ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ పశ్చిమలో గెలుపుజెండా ఎగరేసేది ఎవరు తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…
ఈ నియోజకవర్గంలో కాపు, గవర, బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఓటర్లు 2 లక్షల 26 వేలకు పైగా ఉన్నారు. ఇందులో మధ్య తరగతి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారే అత్యధికంగా ఉంటారు. చెప్పవచ్చు. ఇక రాజకీయంగా గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ సాధించి పోటీ చేసిన గణబాబు 30 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దాడి రత్నాకర్ పై విజయం సాధించారు. గణబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ల విజయ ప్రసాద్ పై ఓడిపోయారు. మళ్ల విజయ ప్రసాద్ అప్పుడు కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీయడంతో ఆయన వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించినా ఆ పార్టీ రత్నాకర్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన్నే ఆ పార్టీ బరిలోకి దింపనుందని తెలుస్తోంది. దాదాపుగా ఆయనకే టిక్కెట్ ఖాయమైనట్లే. మాజీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంపై మళ్ల ప్రసాద్‌కు మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో కొంత సానుభూతి కూడా ఉంది. ఇది ఆయనకు కలసి వచ్చే అంశం. గణబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారనే పేరుంది. అయితే గణబాబు అనుచరుల్లో కొంతమంది ఆయన పేరు చెడగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. వాళ్లు చేసే అక్రమాలు, అవినీతి పనులతో ఆయన ప్రతిష్ఠ మసకబారుతోందన్న ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
ఇక తృతియ ప్రత్యామ్నాయంగా తెరమీదకొచ్చిన జనసేన కూడా ఇక్కడ బలంగా ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ సామాజికవర్గ బలంతోనే రెండో స్థానంలో నిలిచింది. కాపు సామాజిక వర్గం ఓటర్లు మాత్రం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి బరిలో నిలవనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు..వైసీపీ నుంచి టికెట్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్న మళ్ల విజయ ప్రసాద్ గవర సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఒకే సామాజికవర్గం నుంచి వీరిద్దరూ ఓట్లు చీల్చుకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా జనసేన పార్టీకి పడేలా అభ్యర్థిని నిలబెట్టాలని జనసేన ప్లాన్ చేస్తుంది. అయితే జనసేనకు చెప్పుకోదగిన స్థాయిలో మాత్రం క్యాడర్ లేదు ఇక్కడ.
మొత్తంగా చూసుకుంటే మాత్రం విశాఖ పట్టణంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. మరి ఎవరి వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.