Home News Politics

విశాఖ అభ్యర్ధుల పై టీడీపీ క్లారిటీ…!

ఒక్కో జిల్లా పై క్లారిటీ ఇస్తున్న టీడీపీ అధిష్టానం పార్టీకి ఆయువుపట్టులాంటి విశాఖ జిల్లా పై దృష్టి పెట్టింది. ఇక సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్‌ విశాఖపట్నం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఏ సీటు నుంచి పోటీ చేయాలన్నది ఇంకా ఖరారు కాకపోయినా ఆయన ఆ జిల్లా నుంచే పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితి ప్రకారం విశాఖ ఉత్తరం, భీమిలి సీట్లలో ఏదో ఒకదానిలో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విశాఖ ఉత్తరం సీటుకు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమిలి సీటుకు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేశ్‌ భీమిలిలో పోటీ చేయాలనుకుంటే గంటా విశాఖ ఉత్తరం లేదా విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశం ఉంది. లోకేశ్‌ విశాఖ ఉత్తరంలో పోటీ చేయాలనుకుంటే మంత్రి భీమిలిలోనే పోటీ చేస్తారని అంటున్నారు.

యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కూడా విశాఖ ఉత్తరం ఆశిస్తున్నారు. కానీ లోకేశ్‌ వస్తే ఆయన యలమంచిలిలోనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్‌ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. తన తండ్రి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల తాను ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం లేదా దాని చుట్టుపక్కల సీట్లను ఎంపిక చేసుకుంటే ఆ అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టించవచ్చని, తాను అక్కడ నుంచి మంత్రిగా ఉంటే ఉత్తరాంధ్ర.. అందులోనూ విశాఖ నగరం బాగా ప్రయోజనం పొందుతాయని ఆయన భావిస్తున్నారు.

ఆయన తోడల్లుడు, దివంగత టీడీపీ నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌ ఈసారి విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. లోకేశ్‌ విశాఖ జిల్లాలో పోటీచేస్తే భరత్‌కు ఇక అవకాశం ఉండకపోవచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకే జిల్లా నుంచి సమీప బంధువులకు ఇద్దరికి అవకాశం ఇవ్వడం సరికాదని, పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నాయి. భరత్‌ కాని పక్షంలో ఎంపీ సీటుకు మంత్రి గంటా, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంది. గంటా గతంలో అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేయడానికి గంటా ఆసక్తి చూపడం లేదు. దీంతో పల్లానే ఎంపిక చేయవచ్చంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీటుకు టీడీపీలో చేరబోతున్న మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

కొణతాల ఆసక్తి చూపని పక్షంలో విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌ పేరు పరిశీలనకు రావచ్చు. కొణతాల అభ్యర్థి అయితే అనకాపల్లి అసెంబ్లీ సీటుకు పీలా గోవింద్‌ బదులు వేరే నేత అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడమే దీనికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్‌కి అనకాపల్లి ఎంపీ సీటు అడుగుతున్నా జరిగేటట్లు కనిపించడం లేదు. మంత్రినే నర్సీపట్నం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తోంది.

విశాఖ జిల్లాలోని మెజారిటీ అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. విశాఖ తూర్పు-వెలగపూడి రామకృష్ణ, విశాఖ పశ్చిమ గణబాబు, విశాఖ దక్షిణ వాసుపల్లి గణేశ్‌కుమార్‌, గాజువాక పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, శృంగవరపు కోట కోళ్ల లలిత కుమారి, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, యలమంచిలి పంచకర్ల రమేశ్‌బాబు, అనకాపల్లిపీలా గోవింద్‌కు తిరిగి టికెట్లు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వీరంతా సిటింగ్‌ ఎమ్మెల్యేలు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే వంగలపూడి అనిత సొంత పార్టీ నాయకుల నుంచి కొంత అసమ్మతి ఎదుర్కొంటుండటంతో అక్కడి పరిస్థితిని పార్టీ అధిష్ఠానం వివిధ కోణాల్లో పరిశీలిస్తోంది. చోడవరంలో ఎమ్మెల్యే కెఎ్‌సఎన్‌ రాజు కూడా పార్టీ వర్గాల్లో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గాన్ని కూడా పరిశీలనలో ఉంచారు.

మాడుగులలో ఇన్‌చార్జి రామానాయుడు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి పేరు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. పైడా ప్రసాదరావు, మరి కొందరు కూడా ఆశిస్తున్నారు. ఈ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలు అరకు లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తున్నాయి. అరకులో మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌, పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పోటీ చేయనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here