Home News Stories

కమలంలోకి రాములమ్మ

రాములమ్మ కండువా మార్చబోతోంది. విజయానికి కేరాఫ్‌ అడ్రస్‌.గా మారుతున్న పార్టీకి జై కొట్టబోతోంది. కొన్నాళ్లుగా త్రిశంకుస్వర్గంలో ఉన్న తన రాజకీయ జీవితానికి బీజేపీనే సరైన గమ్యం అనుకుంటోంది విజయశాంతి. అందుకే ముహూర్తం సిద్ధంచేసుకుంది. మరో ఆలోచన లేకుండా కమలం పార్టీనే ఫిక్స్‌ చేసేసుకుంది. విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయమనే విషయం తేలిపోయింది. ఢిల్లీ పెద్దల సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారు విజయశాంతి. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ హోదాలో ఉన్నా…కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉన్నారు విజయశాంతి. ఓ పదవి పడేసినా తనకు పార్టీలో తనకు గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

తెలుగురాష్ట్రాల్లో పూర్తిగా బలహీనపడి, దేశవ్యాప్తంగా నాయకత్వం నీరసపడుతున్న పార్టీలో రాజకీయ భవిష్యత్‌ ఉండదన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే కాంగ్రెస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ…పిలిస్తే వచ్చేస్తానని బీజేపీకి సంకేతాలిచ్చారు.
మోదీ చరిష్మాకు తోడు…ప్రజాకర్షక నేతలు వస్తామంటే పిలిచి కండువాలు కప్పుతున్న బీజేపీ రాములమ్మతో సంప్రదింపులు మొదలుపెట్టింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండుసార్లు సమావేశమయ్యాక, విజయశాంతిని కలిశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. అంతకుముందునుంచే బీజేపీ అగ్ర నేతలతో కూడా టచ్.లో ఉన్నారు విజయశాంతి. తాజాగా బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో కమలం జోరు కొనసాగడం, చివరికి కేసీఆర్‌ సొంత జిల్లాలో దుబ్బాక సీటును కూడా బీజేపీనే గెలుచుకోవటంతో…కమలం కండువా కప్పుకునేందుకు ఇదే మంచి సమయం అనుకుంటున్నారు రాములమ్

విజయశాంతి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలియగానే కాంగ్రెస్‌ ఉలిక్కిపడింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ తానే స్వయంగా రాములమ్మ ఇంటికెళ్లి మాట్లాడారు.. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. దీంతో విజయశాంతి పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరిగినా…తాజా పరిణామాలు మాత్రం ఆమె పార్టీ మారడం ఖాయమనే చెబుతున్నాయి. మాణిక్కం ఠాగూర్‌ కాస్త ముందు వచ్చి ఉంటే పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేదన్న కామెంట్‌.తో… కాంగ్రెస్‌కి రాములమ్మ హ్యాండ్‌ ఇవ్వడం కన్ఫమని తేలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే ప్రక్రియతో ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాల్‌ విసిరే స్థాయికి వచ్చిందని దుబ్బాక ఫలితం తర్వాత వ్యాఖ్యానించారు విజయశాంతి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని కేసీఆర్‌.ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌ కంటే బీజేపీనే అన్ని విధాలా ప్రత్యామ్నాయమనే అభిప్రాయంతో విజయశాంతి ఉన్నారన్న విషయం తేలిపోయింది.

ఒకప్పుడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా, దాన్ని టీఆరెస్‌లో విలీనం చేసి.. దేవుడిచ్చిన చెల్లిగా కేసీఆర్‌ వెంట నడిచినా, తర్వాత బీజేపీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరినా..రాజకీయంగా మాత్రం సెటిల్‌ కాలేకపోయారు విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో తనకూ కొంత షేర్‌ ఉన్నా…రాజకీయంగా అనామకంగా మిగిలిపోయానన్న అసంతృప్తితో రగిలిపోతూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోనైనా లక్కు కలిసొస్తుందనుకుంటే పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. ఇప్పటికైనా జాగ్రత్తపడకపోతే రాజకీయంగా పూర్తిగా తెరమరుగైపోతానన్న ఆందోళనతో ఉన్న విజయశాంతికి…బీజేపీనే సరైన ఆప్షన్‌.గా కనిపించింది. ప్రస్తుతానికి ఏదన్నా పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా…భవిష్యత్తు రాజకీయాలకైనా బీజేపీనే బెటర్‌ అని ఫిక్స్‌ అయిపోయింది రాములమ్మ. ఇక మాటల్లేవ్‌. మాట్లాడుకోడాల్లేవ్‌. కాషాయ కండువా కప్పుకోవడమొక్కటే తరువాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here