Home News Stories

వేములవాడ రాజన్న ఇంట గెలిచేదెవరు..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ టీఆర్ఎస్ కి కంచుకోటగా మారింది. ఇక్కడ నుంచి మూడుసార్లు డాక్టర్ చెన్నమనేని రమేశ్ విజయం సాధించారు. ఫస్ట్ లిస్టులోనే చోటు దక్కించుకున్న ఆయన రెండు నెలలుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడ ఆలయ ఛైర్మన్ గా పనిచేసిన ఆది శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. వేములవాడ స్థానాన్ని కీలకంగా తీసుకున్న టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వేములవాడలో ప్రచారం నిర్వహించారు. రసకందాయంలో ఉన్న వేమువాడ రాజకీయం పై తెలుగు పాపులర్ టీవీ ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్

రాజకీయంగా సుదీర్ఘ నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి చెన్నమనేని రమేష్ వచ్చారు. ఆయన జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పైన కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యాక టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2012లో తెలంగాణ కోసం రాజీనామా చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పైనే ఆయన 50 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ పై సుమారు 5 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు జర్మనీలోనూ పౌరసత్వం ఉందని, రెండు దేశాల్లో పౌరసత్వం ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదని ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కి వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రోత్బలంతో వేములవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు ఆది శ్రీనివాస్. వేములవాడ ఆలయ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. అయితే, 2009 తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకోవడంతో బీజేపీలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేశారు. స్థానికంగానే ఉండే ఆది శ్రీనివాస్ కు ప్రజల్లో మంచి పేరుంది. నిత్యం ప్రజల్లో కలిసి ఉంటారు. ఇక వరుసగా మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా ఉండటం ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినా స్వంత ఇమేజ్ తో భారీగా ఓట్లు తెచ్చుకుని 5 వేల ఓట్లతో తేడాతో ఆది ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు కూడా తోడవనుండటంతో విజయంపై ధీమాగా ఉన్నారు.

ఇక చెన్నమనేని రమేష్ కి కూడా విద్యావంతుడు, సౌమ్యుడిగా మంచి పేరుంది. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివద్ధి కార్యక్రమాలు చేయగలిగారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. రూ.400 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోనూ బైపాస్ రోడ్ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పనకు పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. కానీ, వరుసగా మూడుసార్లు గెలవడంతో సహజంగానే ప్రజల్లో ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది, ఇక ఆది శ్రీనివాస్ పై సానుభూతి కూడా ఉంది. దీంతో ద్విముఖ పోరులో చెన్నమనేని రమేష్ కి ఈ ఎన్నికల్లో గెలుపు కొంచెం కష్టంగానే మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here