Home News Politics

వంగవీటి రాధా ప్రెస్ మీట్ సారంశం ఇదేనా…?

వంగవీటి రాధా గారి ప్రెస్ మీట్ తరువాత ఆయన టీడీపీలోకి వెళ్ళటం ఖాయం అనిపిపిస్తుంది,త్వరలోనే ముహూర్తం పెట్టుకున్నట్లున్నారు. ఏదైనా అనివార్య కారణాల వలన రాధా టీడీపీ లో చేరటం ఆగిపోయినా ఈరోజు ఆయన మాట్లాడిన విషయాలు మరుగునపడవు,ప్రజలు మర్చిపోరు. తన తండ్రి హత్యను మొత్తం టీడీపీకి ఆపాదించటం సమంజసం కాదని చెప్పి రాధా తేనెతుట్టెను మళ్ళీ కదిలించారు.నిజమే ఒక హత్యను మొత్తం టీడీపీకి లేక ఒక కులానికి ఆపాదించటం అసమంజసం. రంగా గారి హత్య విషయంలో మొత్తం టీడీపీ ని నిందించింది ఎవరు? రంగా మృతదేహాన్ని చూడటానికి వొచ్చిన అప్పటి ముఖ్యమంత్రి మొహం మీద తలుపు వేసింది,ఎన్టీఆరే రంగా హత్యకు కుట్ర పన్నారని ఆరోపించి,రంగా ఆత్మశాంతి కోసం ఎన్టీఆర్ ను గద్దె దించుతామని శపధం చేసింది తన తల్లి రత్నకుమారి గారే అన్న సంగతి రాధ విస్మరించి “వాళ్ళు రంగా హత్యను మొత్తం టీడీపీ కి” ఆపాదించారు అని ఎవరిని నిందిస్తున్నారు?

నిందితులు రంగాను హత్య చెయ్యటానికి క్రిస్మస్ పండగ రాత్రి , తెల్లవారితే డిసెంబర్ 26 నే ఎందుకు ఎంచుకున్నారు? రంగా నిరాహారదీక్షా శిబిరం నిర్వహణ ,రక్షణలో దళిత యువకులు ఎక్కువ మంది ఉన్నారు ,వారు క్రిస్మస్ పండగ జరుపుకొని విశ్రాంతిలో ఉంటారని, అందువలన హత్యకు సులభం అవుతుందన్న ఆలొచనతోనే క్రిస్మస్ రాత్రిని హత్యకు ఎంచుకున్నారని పత్రికలూ రాశాయి. రంగా హత్య తరువాత జరిగిన విధ్వంసంలో ప్రాణాలు,ఆస్తులు పోగొట్టుకున్నవారు ఏవరు? రంగా హత్యను మొత్తం టీడీపీకి ఆపాదించటం తప్పు అన్నంత సులభంగా నష్టపోయినవారిలో అందరు ఉన్నారని అనగలరా? అసలు కోస్తా మొత్తం విధ్వంసం ఎందుకు జరిగింది? టీడీపీలో చేరుతున్న సందర్భంలో రాధా తేనెతుట్టెను కదిలించారు, ముగిసిపోయిన చర్చను మళ్లి లేవనెత్తారు… భవిషత్తులో ఈప్రశ్నలు కూడా తలెత్తుతాయి. రంగా హత్య ఆయనకు అమరుడి స్థాయిని తెచ్చింది,భావోద్వేగాలతో రగిలిపోయారు.

1989 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి మొదటి మూడు ముఖ్యకారణాలలో రంగా హత్య ఒకటి కానీ 1994 నాటికి ఈ బావోద్వేగాలు మిగలలేదు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 26 మంది MLA లలో కాపులు కేవలం నలుగురు .కాపులలో ఆసీఫ్ నగర్ నుంచి దానం నాగేందర్ , ఉణుకూరు నుంచి కళా వెంకట్ రావ్ మీద పాలవలస రాజశేఖరం,పెదకూరపాడు నుంచి కన్నా లక్ష్మీనారాయణ మరియు విజయవాడ ఈస్ట్ నుంచి వంగవీటి రత్న కుమారి మాత్రమే కాంగ్రెస్ తరుపున గెలిచారు.

2004లో రత్నకుమారి గారిని కాదని 25 సంవత్సరాలు నిండిన రాధాకు జగన్ ప్రోద్బలంతో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. రాధాకు టికెట్ ఇవ్వటాన్ని నిరసిస్తూ రత్నకుమారి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. తన తల్లికి టికెట్ ఇవ్వకుంటే నిరాహారదీక్ష చేస్తానని రాధా చెల్లలు ఆశా నానా హడావిడి చేశారు. రంగా వర్గం నుంచి నాయకులు తయారయ్యారు వారిలో మల్లాది విష్ణు,బోండా ఉమా మహేశ్వర్ రావ్ లాంటి వారు MLA లయ్యారు. రాధా వెనుక చాలా తక్కువ మంది రంగా అనుచరులు మిగిలారు.

2009 లో నియోజకవర్గాల పునఃవిభజనలో దేవినేని నెహ్రు ప్రాతినిధ్యం వహిస్తున్న కంకిపాడు రద్దయ్యి రాధా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడపై తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ భాగం కలిసింది. కొత్తగా ఏర్పడిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. సీనియర్ నెహ్రూను కాదని రాధాకు తూర్పు టికేట్ దక్కుతుందా? సెంట్రల్ టికేట్ లగడపాటి ఎవరికీ ఇప్పిస్తారు? వైస్సార్ “I will take care of you Radha” అని చెప్పినా సమాధానపడకుండ వైస్సార్ దేవినేని నెహ్రూకు విలువైన భూములు కట్టపెట్టారని ఆరోపించి 2008 డిసెంబర్ చివరిలో అంటే పీఆర్పీ ఏర్పడిన మూడు నెలల తరువాత రాధా కాంగ్రెసును వీడి పీఆర్పీలో చేరారు.


రాజకీయపార్టీ అనేది ఉమ్మడి వ్యవస్థ. తనకు నచ్చని వారు ఆ పార్టీలో ఉండకూడదు అనుకోవటం రాజకీయ నాయకుడికి నష్టం చేస్తుంది. రాధా కన్నా ముందు నుంచి పీఆర్పీలో పనిచేస్తున్న కేశినేని నానిని బయటకు పంపేంతవరకు రాధా ఊరుకోలేదు. చివరికి తాను టికెట్స్ ఇప్పించిన వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ నుంచి,యలమంచిలి రవి విజయవాడ ఈస్ట్ నుంచి గెలవగా రాధా మాత్రం సెంట్రల్ నుంచి కాంగ్రెస్ మల్లాది విష్ణు మీద ఓడిపోయార . ఆ ఎన్నికల్లో రాధా సులభంగా గెలవలసింది కానీ దుందుడుకు వైఖరే దెబ్బకొట్టింది. రంగా వర్ధంతి రోజు మల్లాది విష్ణు రాంగా విగ్రహం మీద కాంగ్రెస్ జెండా కప్పి దండవేయగా రాధా విష్ణును కొట్టారు. రంగా విగ్రహం మీద కాంగ్రెస్ జెండా తొలగించి ప్రజారాజ్యం జెండా కప్పారు.పోలింగ్ ముందు రోజు కూడా ఒక స్వతంత్ర అభ్యర్ధీ మీద దాడి చేశారు.

పీఆర్పీ తరుపున గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ తో రాధా కయ్యం పెట్టుకున్నారు. చిరంజీవి వెల్లంపల్లి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హాజరయ్యి తను జాతరకు ఆహ్వానిస్తే రాలేదని చిరంజీవి గారి మీద బహిరంగ విమర్శలు చేశారు. పీఆర్పీ ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు రాధా కాంగ్రెస్లో చేరకుండా దూరంగా ఉండిపోయారు.సిట్టింగ్ మల్లాది విష్ణును కాదని తనకు టికెట్ ఇవ్వరన్న అనుమానంతోనే రాధా కాంగ్రెస్లో చేరలేదని పత్రికల్లో వార్తలు వొచ్చాయి. రాధా 2012లో వైసీపీలో చేరిన సందర్భంలో ప్రాణం ఉన్నంతవరకు జగన్ తోనే అని ఆవేశంగా ప్రకటించారు. 2014 ఎన్నికల్లో రాధా తూర్పు నియోజకవర్గం నుంచి ఓడిపోయాయిన తరువాత పెద్దగా క్రియాశీలకంగా లేరు. సరిగ్గా సంవత్సరం కిందట 2018 జనవరిలో రాధా టీడీపీలో చేరుతారని మీడియాలో వార్తలు వోచ్చాయి. టికెట్,నియోజకవర్గం తదితర కారణాలు ఉండొచ్చు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ ను వైసీపీ విజయవాడ సిటీ అధ్యక్షుడిని చేసినప్పుడే రాధా కు వైసీపీ ఇన్ డైరక్ట్ గా అందరు పార్టీకి అవసరం అని చెప్పినట్లు.మల్లాది విష్ణు ను సెంట్రల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమించటం గౌతమ్ రెడ్డి రంగా మీద చేసిన కామెంట్స్ కూడా రాధ మనసులో బీజాలు నాటి ఉండవొచ్చు.

వైసీపీ రాధను విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే గా లేదా మచిలీపట్టణం ఎంపీ గా పోటీచేయ్యమని చెప్పినట్లు వార్తా. మధ్యలో అవనిగడ్డ కూడా పరిశీలించారు. విజయవాడ తూర్పు నుంచి పోటీచేయటానికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రాధాకు బలమైన మద్దతు ఉన్నకృష్ణలంక,పటమట లాంటి ప్రాంతాలు తూర్పు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఏపార్టీ అయినా సర్దుకుపోలేక పోవటమే రాధా సమస్య. వైసీపీ ని వీడటానికి రాధా చెప్పిన కారణాల కన్నా టీడీపీలోకి వెళ్ళటానికి ఆయన చెప్తున్నా కారణాలే చర్చనీయాంశం. రంగా ఆశయాల సాధనకై టీడీపీలోకి వెళ్ళతున్నాను అని చెప్పటం రంగా అభిమానులను కన్విన్స్ చెయ్యలేదు .

ఇప్పుడు ఎన్టీఆర్ లేరు,దేవినేని నెహ్రు లేరు కాబట్టి నాకు టీడీపీ తో ఇబ్బందిలేదు అని చెప్పొకోవచ్చు మరి దేవినేని అవినాష్ ను టీడీపీ టికెట్ ఇస్తే సర్దుకుపోతారా?రంగా హత్యలో ముద్దాయిగా ఉన్నా రామకృష్ణ బాబు టీడీపీ తరుపున విశాఖ తూర్పు ఎమ్మెల్యే గా ఉన్నారు. రాధా చెప్తున్నా ఇళ్ల పట్టాలు సాద్యమా?విజయవాడలో కొండల మీద కట్టిన ఇళ్లకు పట్టాలు ఇవ్వటం ముఖ్యమంత్రి ఒక్క GO తో సాధ్యం అయ్యేపని కాదు అని రాధాకు తెలియదనుకోలేము.

రాధా టీడీపీలో చేరితే టికెట్ ఎక్కడ ఇస్తారో చూడాలి. తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యే . గద్దె రామ్మోహన్ గారిని ఆయన పాత నియోజకవర్గం గన్నవరం (1994లో రెబల్ గా గెలిచారు) పంపి తూర్పు రాధాకు ఇవ్వాలంటే గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే రాధా ఆప్త మిత్రుడైన వంశీకి మొండిచెయ్యి చూపించాలి. టీడీపీ కార్యకర్తలు రాధా చేరిక మీద ఉత్సాహంగా ఉన్నారా? రంగా విగ్రహం మీద రాధా ప్రజారాజ్యం జెండా కప్పినట్లు రేపు టీడీపీ లో చేరి పచ్చ జెండా కప్పుతారా ?అలా జరిగితే వంగవీటి మోహన రంగా అస్తిత్వన్నీ దెబ్బతీసినట్లే.

రాధా ఆరోపణల గురుంచి రాయటానికి ఏమిలేదు,కాంగ్రెస్,PRP లను వీడినప్పుడు ఎలాంటి ఆరోపణలు చేశారో ఇప్పుడు అలాంటి ఆరోపణలుచేశారు. ఏపార్టీలో ఉన్నా ఈఊరిలో ఈకార్యక్రమం చేసినా అక్కడి స్థానిక నాయకుడికి సమాచారం ఇవ్వమని చెప్తారు. తండ్రి లేని బిడ్డగా జాలి చూపిస్తున్నాను అని జగన్ అన్నారని రాధా ఆరోపించారు ,దీనిలో నిజా నిజాలు ఎంతవారకొకాని జగన్ కూడా తండ్రిని కోల్పోయిన యువకుడే!రాధా ఏజ్ గ్రూప్ లో ఉన్న జగన్ జాలి లాంటి పదాలు వాడితే అవి ఆయనకు వర్తిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here