Home News Stories

వచ్చే ఎన్నికల నాటికన్న ఆ రెండు భర్తీ అవుతాయా..?

అక్కడ ఆశావహులకు కొదవలేదు.. దిగ్గజ నేతలే తమకు ఛాన్స్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.. ఎప్పటికప్పుడు వివిధ ఈక్వేషన్లతో వారికి మొండిచేయి ఎదురవుతూ వస్తోంది.. అయినా పార్టీకి వీరవిధేయులైన సదరు ఆశావహులు అంతర్గతంగా ఎలా ఫీల్‌ అవుతున్నా.. ఏనాడూ అధిష్టానానికి వ్యతిరేకంగా పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు .. తమ అసంతృప్తి ఎప్పుడూ బయట పెట్టలేదు.. ఎన్నికలకు ఏడాది ఉన్న సమయంలో అటువంటి నేతల్లో ఇద్దరినైనా సంతృప్తిపరచడానికి అవకాశం దక్కింది పార్టీ పెద్దలకి.. అయినా ఆ దిశగా అడుగులు పడకపోవడానికి కారణమేంటి? .. సదరు ఈక్వేషన్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారా?


రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఈ ఏడాది మార్చిలో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగింది. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు ఇద్దరు రాజీనామాలు చెయ్యగా…రాష్ట్ర కేబినెట్‌నుంచి ఇద్దరు బిజెపి మంత్రులు కూడా తప్పుకున్నారు. దీంతో సీఎంతో కలిసి 26 మంది ఉన్న కేబినెట్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్రంతో పోరాటం, రాజకీయ పరిణామాలతో ఆ రెండు బెర్తుల భర్తీపై అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు. ఇదే సమయంలో కేబినెట్‌లో ఎస్టీ, ముస్లింల నుంచి ఒక్కరూ లేకపోవడంతో తమకో అవకాశం వస్తుందని చాలా మంది ఎదురు చూశారు.

బీజేపీకి దూరమయ్యాక ముస్లిం వర్గాన్ని దగ్గర చేసుకోవాలని అధికార టీడీపీ పావులు కదిపింది. ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే కేబినెట్‌లో ముస్లిం నేతకు చోటిస్తామని స్వయానా సీఎం ప్రకటించారు. ఈ చర్చ మొదలై కూడా మూడు నెలలు కావస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. రాజకీయ నిర్ణయాల విషయంలో జాప్యం చేస్తూ వస్తున్న టీడీపీ అధినాయకత్వం కేబినెట్‌లో రెండు పదవుల మీద కూడా ఎడతెగని కసరత్తు చేస్తోంది. పదవి ఎవరికనే విషయంలో ముఖ్యమంత్రికి క్లారిటీ ఉన్నా…బయటికి వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

మొదట్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ కు మంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్ చాలా కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. అయితే రాయల సీమకు చెందిన ముస్లింనేతకే మంత్రి పదవి ఇవ్వాలనే అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు సమాచారం. అయితే రాయలసీమలో పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముస్లిం నేతలు ఎవరూ లేరు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చాంద్ బాషా ఉన్నా…ఆయన వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు. దీంతో ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్న ఫరూఖ్ నే కేబినెట్‌లోకి తీసుకుంటారని….మండలి చైర్మన్ పదవి వేరే వారికి అప్పగిస్తారనే అంచనాతో పార్టీ శ్రేణులున్నాయి.

పేరుకు విస్తరణ అంటున్నా కొత్తగా కేబినెట్‌లోకి ఇద్దరొచ్చే అవకాశం మాత్రమే ఉంది. మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలకు 8 నెలల ముందు కేబినెట్‌లో మార్పులు చేర్పులంటే తేనెతుట్టెని కదపడమే. అందుకే ఆ సాహసం చేసే అవకాశం లేదని పార్టీ నేతలు అంటున్నారు. కొందరు మంత్రులపై సీఎం అసంతృప్తితో ఉన్నా….వారి విషయంలో ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే ఇవ్వాలనుకున్న రెండు పదవులపైనా జాప్యం జరుగుతుండటంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

సీఎం తన మనసులో ఉన్న వారిని సామాజిక, ప్రాంతీయ లెక్కల ప్రకారం ఎంపిక చేస్తే సరిపోయేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఎలాంటి బలమైన కారణాలు లేకుండా…..నెలల తరబడి చేస్తున్న జాప్యంతో విస్తరణ అంశం పార్టీలో, ప్రభుత్వంలో జోక్‌గా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక నిర్ణయాల విషయంలో జాప్యం పార్టీకి మేలు చెయ్యకపోగా నష్టం చేసే ప్రమాదం ఉందంటున్నారు నేతలు. అమెరికా పర్యటననుంచి తిరిగొచ్చాకయినా సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారా…మరింతకాలం నానుస్తారా అన్న చర్చ నడుస్తోంది. మొత్తంగా చూస్తే మాత్రం పదవి వచ్చే అవకాశం ఉన్న వాళ్లూ…పదవి రేసులో లేని వారు కూడా కేబినెట్ విస్తరణపై జోకులు పేల్చుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here