దేశంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. కరోనా భయంతో పరీక్షల కోసం జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో ఉన్నవారికి ఆక్సిజన్ 93 శాతం కన్నా తక్కువగా ఉండి, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ఆక్సిజన్ థెరపీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్యులు. ఆక్సిజన్ పడిపోతున్నప్పుడే స్టెరాయిడ్స్ అవసరమవుతాయంటున్నారు. కరోనా సోకి తేలికపాటి లక్షణాలతో ఉన్న వారికి స్టెరాయిడ్స్, ఆక్సిజన్ అవసరం ఉండదు. ప్రాథమిక దశలో స్టెరాయిడ్స్ వాడితే వైరస్‌కు బలం పెరుగుతుందని, ఓవర్ ట్రీట్మెంట్ వల్ల నష్టం కలుగుతుందంటున్నారు డాక్టర్లు.

సిటీ స్కాన్ తీవ్రమైన లక్షణాలతో బాధపడేవారికి మాత్రమేనని వైద్యులు సూచిస్తున్నారు. స్టెరాయిడ్స్ రోగి పరిస్థితి దిగజారినప్పుడే వాడాల్సి ఉంటుందంటున్నారు వైద్యులు. ప్రాథమిక చికిత్సలోనే అలాంటివి తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు. ఒకసారి సిటీ స్కాన్ చేస్తే అది మూడు వందల ఎక్స్రేస్తో సమానమని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా లక్షణాలు లేని వారు తేలికపాటి లక్షణాలు ఉన్నవారు సిటీ స్కాన్ జోలికి వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు.