అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడంటే చీమచిటుక్కుమనకుండా వినాలి. అంతరాయం లేకుండా ప్రసారం జరగాలి. కానీ పోయేకాలమొస్తే అన్నీ అపశకునాలే అన్నట్లు అగ్రరాజ్య అధినేతకు ముందే పరాభవాలు తప్పటం లేదు. వైట్‌హౌస్‌నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్న లైవ్ స్పీచ్‌ని కొన్ని టీవీ ఛానల్స్ మధ్యలోనే ఆపేశాయి. అధ్యక్షుడు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారన్న కారణంతో ఛానల్స్ ఆయన గొంతు జనంలోకి వెళ్లకుండా కట్ చేశాయి. 17 నిమిషాల ప్రసంగంలో డెమోక్రాట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. అక్రమ ఓట్లతో డెమొక్రాట్లు ఈ ఎన్నికను తమ నుంచి లాగేసుకుంటున్నారని ఆరోపించారు. ట్రంప్ బ్యాలెన్స్ తప్పటంతో న్యూస్ ఛానెళ్లు లైవ్‌ని మధ్యలోనే నిలిపివేశాయి.

తనను ప్రశ్నించిన జర్నలిస్టులను ప్రెస్మీట్లోంచి మధ్యలోనే పంపించే ట్రంప్‌కి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఏం వాగినా నోరుమూసుకుని ప్రసారంచేస్తారనుకున్న ట్రంప్ లెక్క తప్పని తేలింది. తన ఓటమికి కంకణం కట్టుకున్నవారికి సహకరిస్తోందంటూ మీడియాను కూడా నిందించాడు ట్రంప్. ఓటింగ్‌లో మోసాలు జరిగాయని ఆధారంలేని ఆరోపణలు చేశాడు. మరోవైపు ఓటింగ్‌లో మోసం జరిగిందనీ, కౌంటింగ్ నిలిపివేయాలని ట్రంప్ చేసిన ట్వీట్లను ట్విట్టర్ కూడా తప్పుపట్టి…ప్రమాదకర ఫ్లాగ్మా్ర్క్ పెట్టింది.
ఓవైపు ఓటింగ్‌తో పాటు కౌంటింగ్ నడుస్తుండగానే కోర్టుల్ని ఆశ్రయిస్తున్న ట్రంప్‌కి అక్కడ కూడా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. మిచిగాన్‌లో బిడెన్ గెలవడానికి కొద్దిసేపటి ముందు పెన్సిల్వేనియా, మిచిగాన్ కోర్టుల్లో పిటిషన్లేశారు ట్రంప్. కాలం కలిసిరానప్పుడు తాడే పామై కాటేసినట్లు…ట్రంప్‌కి ఇంటాబయటా ఎటుచూసినా షాక్‌లమీద షాకులు తగులుతున్నాయి.