Home News Stories

రాజుల కోటలో రాజ్యధినేత ఎవరు…!

పశ్చిమగోదావరి జిల్లాలో రాజులకు కంచుకోటగా ఉంటోన్న ఉండి నియోజకవర్గంలో ఈ సారి ప్రధాన పార్టీలతో పాటు ముగ్గురూ కొత్త అభ్యర్థులే రంగంలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది. భీమవరం నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ఉండి నియోజకవర్గం నుంచి గత కొన్ని దశాబ్దాలుగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఉండి నియోజకవర్గం సామాజికపరంగా చూస్తే రాజులకు కంచుకోటగా ఉంటోంది.

నియోజకవర్గంలో కాపులు 33,000 , క్షత్రియులు 26,000, గౌడ‌, శెట్టిబలిజ 33,000, ఇతర బీసీలు 36,000, తూర్పు కాపు 21,000, క్రైస్తవులు 16,000, ఎస్సీలు 17,000 చొప్పున ఓటర్లు ఉన్నారు. టీడీపీ ఆవిర్బావం నుంచి చూస్తే ఒక్క 2004 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ ఇక్కడ నుంచి ఓడిపోయింది. 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదు ఎన్నికల్లో మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు వరస విజయాలు సాధించారు. ఆయన శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఉండి ప్రస్తుత ఎమ్మెల్యే, నరసాపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కలువపుడి శివ 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.

ప్రస్తుతం ఉండి అంటే శివకు కంచుకోటగా మారిపోయింది. అయితే చంద్రబాబుకు అనూహ్యంగా శివను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పంపడంతో శివ స్వగ్రామం కలువపూడికి చెందిన మంతెన రామరాజు కు అనూహ్యంగా టీడీపీ సీటు దక్కింది. అదే టైమ్‌లో వైసీపీ నుంచి ఉండి మండలం యండగంటికి చెందిన సీవిఎల్‌. నరసింహారాజు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా సొసైటీ అధ్యక్షులుగా పని చేశారు. ఇక జనసేన మద్దతుతో సీపీఎం నుంచి భూపతిరాజు బలరాం పోటీలో ఉన్నారు. జనసేన స్వయంగా తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపితే ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉండేది. అయితే జనసేన సీపీఎంకు ఉండి సీటును వదిలేయడంతో ఇక్కడ జనసేన ప్రభావం నామ‌ మాత్రమే అని చెప్పాలి.

ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్న కాపు ఓటర్లు సీపీఎంకు మద్దతు ఇస్తారని చెప్పలేం. అధికార టీడీపీ విషయానికి వస్తే శివ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేస్తుండడం కలిసి వస్తుందన్న అంచనాతో ఉంది. నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉంటూ వస్తుండడంతో పాటు బలమైన కేడర్‌, పింఛన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు ప్లస్‌ అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రముఖంగా ఉన్న ఆక్వా రంగం అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చేసిన కృషి కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీకి కొంత ప్లస్‌ కానుంది. టీడీపీ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఓడిన పాతపాటి సర్రాజు స్వయంగా తప్పుకుని సీవిఎల్‌. నరసింహారాజుకు ఛాన్స్‌ ఇచ్చారు.

యండ‌గండి సొసైటీ ప్రెసిడెంట్‌గా పని చేసిన నరసింహారాజు ప్రధానంగా టీడీపీ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన కాపు సామాజికవర్గం ఓటింగ్‌ చీలిపోవడం, యండగండి సొసైటీ అధ్యక్షుడిగా గత రెండు దశాబ్దాలుగా చుట్టుపక్కల రైతులతో ఉన్న పరిచయాలు, సేవలు తనకు కలిసివస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. జనసేన పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థిగా 30 సంవత్సరాలుగా ప్రజా ఉద్య‌మాల్లో ఆదర్శ నాయకుడిగా పేరున్న భూపతిరాజు బలరాం పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆయన చేసిన ఉద్య‌మం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

జనసేన పోటీ చేస్తే కాపు సామాజికవర్గం ఓట్లలో మెజారిటీ జనసేనకు పడే ఛాన్స్‌ ఉంది. అయితే ఇప్పుడు సీపీఎం అభ్యర్థి రంగంలో ఉండడంతో కాపు వర్గం ఓటింగ్‌తో పాటు పవన్‌ అభిమానులు సీపీఎం అభ్యర్థికి ఎంత వరకు సపోర్ట్‌ చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఇక మైన‌స్‌ల‌ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి కొత్త వాడు కావడం, నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే శివతో పోల్చి చూసుకోవడం కాస్త ఇబ్బందే. ఇక వైసీపీ అభ్యర్థి సీవిఎల్‌. నరసింహరాజు ఇప్పటికే నాలుగైదు పార్టీలు మారడంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోయే మనస్తత్వం లేదన్న అపవాదు ఎదుర్కొంటున్నారు. సీపీఎం అభ్యర్థి బలరాం జనసేన ఓట్లు చీలిపోవడం, ఆర్థికంగా బలహీనంగా ఉండడం లాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఏదేమైనా రాజుల కంచుకోటలో ముగ్గురు రాజుల మధ్య‌ జరుగుతున్న పోరులో ప్రస్తుతానికి టీడీపీకి స్వల్ప ఎడ్జ్‌ ఉన్నట్టు కనిపిస్తున్నా తుది సమరంలో ఎవరు రారాజుగా నిలుస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here