Home News Stories

ఏడుకొండ‌ల‌వాడా..ఇదెక్క‌డి గోల‌!

ఏడుకొండ‌ల‌వాడా..ఇదెక్క‌డి గోల‌!

TTD Temple
TTD Temple

ఏడాదైపోయింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ప‌ద‌వీకాలం ముగిసిపోయి. ప్ర‌పంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి పాల‌క‌వ‌ర్గాన్ని నియ‌మించే తీరిక‌లేక‌పోయింది ప్ర‌భుత్వానికి. అదేమంటే ఎన్నో త‌ల‌కుమించిన ప‌నులు. బీజేపీతో అంట‌కాగిన‌న్నాళ్లూ ఆ వైపునుంచి మా సంగ‌తేంట‌ని ఒత్తిళ్లు. ఒంటికి అంటిన కాషాయాన్ని క‌డిగేసుకున్నాక ఇప్ప‌టికి ఓ క్లారిటీ వ‌చ్చింద‌నుకుంటే రోజుకోవివాదం. పూట‌కో దుమారం.

  • కీల‌క‌మైన టీటీడీ బోర్డు నియామ‌కం విష‌యంలో పుట్టుపూర్వోత్త‌రాలు, కుల‌గోత్రాలు, వ్య‌క్తిగ‌త నేప‌థ్యం ప్ర‌తీదీ కీల‌క‌మే. ఎక్క‌డ ఏ మ‌చ్చ దొరికినా పుణ్య‌క్షేత్రం ప‌విత్ర‌త మంట‌గ‌లిసింద‌ని వివాదం చెల‌రేగే ప్ర‌మాదం ఉండ‌నే ఉంటుంది. పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్ పేరుని టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి ప‌రిశీలిస్తున్నార‌ని తెలియ‌గానే వివాదం మొద‌లైంది. ఆయ‌న క్రైస్త‌వ మ‌త‌ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో కొన్నాళ్లు ప‌క్క‌న‌పెట్టి మ‌ళ్లీ ఆయ‌న్నే ప్ర‌క‌టించారు. ఆయ‌న నియామ‌కంపైనే ర‌చ్చ జ‌రుగుతుంటే…పాల‌క‌మండ‌లి స‌భ్యుల ప్ర‌క‌ట‌న‌తో కొత్త స‌మ‌స్య‌లు చంద్ర‌బాబు త‌ల‌కు చుట్టుకున్నాయి.

టీడీపీలోకి డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఎంట్రీకి లైన్ క్లియ‌ర్ కావాలంటే ఎమ్మెల్యే టిక్కెట్ రేసునుంచి పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్‌ని త‌ప్పించాలి. అందులో భాగంగానే ఆయ‌న‌కు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నేది ఓపెన్ సీక్రెట్‌. ఆ మ‌ధ్య మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో గ్యారంటీగా ఛాన్స్ ఉంటుంద‌ని ఆశ‌ప‌డి చివ‌రికి భంగ‌ప‌డ్డ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితని టీటీడీ పాల‌క‌మండ‌లి స‌భ్యురాలిగా నియ‌మించ‌డం ఇప్పుడింకో వివాద‌మై కూర్చుంది. ఓ టీవీ ఛాన‌ల్‌కి గ‌తంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రైస్తవురాలినని.. ఎప్పుడూ బైబిల్ త‌న‌తో ఉంటుంద‌న్న వీడియో క్లిప్పింగ్ వైర‌ల్‌గా మారింది.

కేబినెట్‌లోకి తీసుకోలేక‌పోయామ‌నే సింప‌థీతో పాటు సీఎంవోలో ఓ కీల‌క అధికారి ఆశీస్సులు కూడా అనిత‌కు టీటీడీ ప‌ద‌వి ద‌క్కేలా చేశాయ‌ని స‌మాచారం. అయితే క్రైస్త‌వురాలిని టీటీడీలోకి ఎలా తీసుకుంటార‌నే ప్ర‌శ్న రావ‌టంతో దీనిమీదో క‌మిటీ వేసి నివేదిక ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాల‌నుకుంటోంది రాష్ట్ర ప్ర‌భుత్వం. తాను హిందువునని, తన ఇంట్లో పూజ గది కూడా ఉందంటున్న అనిత…హిందువునేని చెప్పుకునేందుకు స్ట‌డీ స‌ర్టిఫికెట్ల‌ను ఆధారంగా చూపాల్సి వ‌స్తోంది.

మ‌రోవైపు దౌర్జ‌న్యాల‌కు దిగే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు టీటీడీ బోర్డులో ఎలా చోటు క‌ల్పిస్తార‌ని మ‌రో వివాదం. మ‌హారాష్ట్ర ఆర్థిక‌మంత్రి భార్యకు టీటీడీ పాల‌క‌మండ‌లిలో అవ‌కాశం క‌ల్పించ‌డంపై వైసీపీ అనుమానాలు వ్య‌క్తంచేస్తోంది. బీజేపీతో పైకి క‌య్యానికి దిగుతూనే…ఆ పార్టీతో టీడీపీ అంట‌కాగుతోంద‌ని… అందుకే బీజేపీ నేత భార్య‌కు ప‌ద‌వి ఇచ్చింద‌ని విప‌క్ష‌పార్టీ విమ‌ర్శిస్తోంది. అస‌లే టీడీపీమీద క‌సిగా ఉన్న బీజేపీ..టీటీడీ బోర్డు విష‌యంలో ప్ర‌భుత్వాన్ని చెడుగుడు ఆడుకోవాల‌నుకుంటోంది. ఏంటోపాపం.. ఈమ‌ధ్య చంద్ర‌బాబు తాడుప‌ట్టుకున్నా పామై కాటేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here