Home News Politics

పార్టీకి ద్రోహ‌మా! ఎలాగెలాగెలాగా?!

కేసీఆర్ కూతురికోసం డీఎస్ టార్గెట్టా?

ఒక‌టికి రెండుసార్లు కాంగ్రెస్‌కి రాష్ట్ర అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ ఆయ‌న‌. అది కూడా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జాతీయ‌పార్టీకి. అప్ప‌ట్లో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి అతి స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి. ర‌చ్చ గెలిచిన వ్య‌క్తి కాలం క‌లిసిరాక ఇంట ఓడిపోయాడు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై బెంగ‌తో త‌న‌ని పెద్ద‌మ‌నిషిని చేసిన పార్టీని వీడి గులాబీ కండువా క‌ప్పుకున్నాడు. ఇప్పుడాయ‌న‌కు రోజూ అవ‌మాన‌భార‌మే. అప‌నింద‌ల ప‌ర్వ‌మే. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నాడ‌నీ, పార్టీని న‌ష్ట‌ప‌రిచేందుకు కుట్ర చేస్తున్నాడ‌నీ. దీంతో త‌న పాతివ్ర‌త్యాన్ని నిరూపించుకునేందుకు ఆ సీనియ‌ర్ శీల‌ప‌రీక్ష‌కు సిద్ధ‌ప‌డాల్సి వ‌స్తోంది పాపం.

షాట్‌క‌ట్‌లో డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌. రాష్ట్ర‌మంతా తెలిసిన పేరు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు రాష్ట్ర అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్పిన అనుభ‌వం ఆయ‌న సొంతం. కానీ ఈ క్వాలిటీసేమీ టీఆర్ఎస్‌లో ప‌నిచేయ‌లేదు. త‌ప్ప‌ద‌న్న‌ట్లు ఆయ‌న‌కో రాజ్య‌స‌భ సీటు ప‌డేశారుగానీ…టీఆర్ఎస్‌లో డీఎస్ న‌లుగురితో పాటు నారాయ‌ణ‌. మ‌ర్యాద మ‌ర్యాద అంటూ ఆయ‌న తాప‌త్ర‌య‌ప‌డ‌ట‌మేగానీ గులాబీ కండువా క‌ప్పుకున్న ఈ పెద్దాయ‌న్ని పార్టీలో ఎవ‌రూ పెద్ద‌గా గౌర‌వించింది లేదు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి వైభ‌వాన్ని త‌లుచుకుని చింతించ‌డం త‌ప్ప ఆయ‌నా చేయ‌గ‌లిగిందేమీ లేదు.

త‌మ నాయ‌కుడికి పార్టీలో త‌గిన గౌర‌వం దొర‌క‌డం లేద‌ని డీఎస్ అనుచ‌ర‌గ‌ణం అడుక్కున్నా..ఇచ్చేదే ఎక్కువ‌న్న‌ట్లు స్పందించింది టీఆర్ఎస్ నాయ‌క‌త్వం. ఇప్ప‌టికే నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత‌లెవ‌రూ ఆయ‌న్ని లెక్క‌చేయ‌డం లేద‌నుకుంటే..ఇప్పుడు అంద‌ర్నీ క‌లుపుకుని ఏకంగా కేసీఆర్ కూతురు క‌విత ఆయ‌న‌పై యుద్ధం ప్ర‌క‌టించింది. పార్టీకి ద్రోహం చేస్తున్న పెద్దాయ‌న‌పై వేటు వేయాల‌ని అధినాయ‌క‌త్వానికి లేఖ రాయించింది. ఇంత‌కీ డీఎస్ టీఆర్ఎస్‌కి చేసిన అతిపెద్ద ద్రోహమేంటంటే…ఆయ‌న కొడుకు అర‌వింద్ బీజేపీలో చేర‌డ‌మే. నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంనుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీకి సిద్ధ‌మ‌వుతుండ‌ట‌మే. త‌మ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు త‌మ యువ‌రాణిమీద పోటీకి సిద్ధ‌మ‌వుతుంటే గులాబీపార్టీ ర‌క్తం మ‌రిగిపోదా మ‌రి!?

బీజేపీలో చేరిన కొడుకుకోసం డీఎస్ న‌మ్మి చేర‌దీసిన పార్టీని ఫ‌ణంగా పెడుతున్నార‌నేది క‌ల్వ‌కుంట్ల క‌విత నాయ‌క‌త్వంలో గులాబీపార్టీ నేత‌లు చేస్తున్న‌ ఆరోప‌ణ‌. ఎదిగిన కొడుకు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు తాను చూసుకుంటే డీఎస్ మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు? ఒకే కుటుంబంలో త‌లోపార్టీలో ఉండే ఈ రోజుల్లో అంతా క‌ట్ట‌గ‌ట్టుకుని ఒకేచోట ఉండ‌టం జ‌రిగేప‌నేనా? త‌ండ్రీకొడుకుల‌మైనా ఎవ‌రి రాజ‌కీయం వారిదేన‌ని ఓప‌క్క డీఎస్ కొడుకు చెబుతూనే ఉన్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అర‌వింద్ నిజామాబాద్ ఎంపీ సీటునుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీచేయ‌డం ఖాయం. పుత్ర వాత్స‌ల్యంతో డీఎస్ ఆయ‌న‌కి ఫేవ‌ర్ చేస్తాడ‌ని టీఆర్ఎస్ భ‌యం. అందుకే పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతోంది. శంఖంలో పోస్తేనే తీర్థ‌మ‌న్న‌ట్లు క‌విత ద్వారా నింద‌లేయించింది. డీఎస్ త‌నంత‌ట తానే బ‌య‌టికొస్తారా? కేసీఆర్ సాగ‌నంపుతారో చూడాలి మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here