Home News

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పై క్లారిటీ వచ్చేసినట్టేనా ?

హుజురాబాద్‌ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో అభ్యర్ది ఎంపికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్‌లో ఆత్మగౌరవం నినాదంతో ఈటల రాజేందర్‌ జనాల్లోకి వెళ్లి.. సానుభూతిని కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఈటల వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్దం చేస్తున్న అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరి పేరును పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతుంది. పార్టీలో ఉన్నవారికి టికెట్‌ ఇస్తారా ఇతర పార్టీ నుంచి వచ్చే బలమైన నేతను బరిలో దించుతారా అన్న చర్చ మొదలైంది.

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి బలమైన అభ్యర్థి పోటీ చేస్తారన్నది అందరూ చెప్పేమాట. అయితే ఆ బలమైన అభ్యర్థి ఎవరన్నదే గులాబీ శ్రేణుల్లు ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థిని నిర్ణయించే దిశగా పార్టీ అధిష్ఠానం కూడా తీవ్రమైన కసరత్తే చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల ఆధారంగా టీఆర్‌ఎస్‌ కింది స్థాయి కార్యకర్తల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకుని బలాబలాలను బేరీజు వేసుకుంటోందట. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల జాబితా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే డజను మందికిపైగా నాయకులు తమ పేర్లను పరిశీలించాలని అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారట.అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నఈటలకు ధీటైన వారు ఎవరా అని ఆరా తీస్తోందట.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేసులో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థి బరిలో ఉంటారని చెవులు కొరుక్కుంటున్నారు. దామోదర్ రెడ్డి సోదరుడు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన సొంతూరు హుజురాబాద్‌ నియోజకవర్గంలోని మామిడాలపల్లి. దామోదర్ రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజికవర్గం ఓట్లు…టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం ఈజీ అని అనుకుంటున్నారట. దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డి పేరు కూడా చర్చల్లోకి వస్తోంది. కశ్యప్‌రెడ్డి టీడీపీ నుంచి 2014లో ఈటలపై పోటీ చేసి ఓడిపోయారు.

కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి వొడితెల రాజేశ్వర్‌రావు మనవడు ప్రణవ్‌బాబు పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ రెండు కుటుంబాలను కాదని అనుకుంటే.. ఈటలపైకి బీసీ నేతనే ప్రయోగిస్తారని కొందరి అభిప్రాయం. మరో పార్టీ నుంచి బలమైన బీసీ నేతను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని బరిలో దించవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు.
సాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అంతకుమించిన ప్రతివ్యూహాలను సిద్దం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here