గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ కీలక ప్రజాప్రతినిధి బర్త్‌డే వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ బర్త్ డే పార్టీ మాములుగా జరిగితే పెద్ద విశేషం ఉందేది కాదు. బర్త్ డే రావల్సిన గెస్టులకు ఫోన్ చేసి వారు తీసుకు రావల్సిన గిఫ్ట్ వ్యాల్యూ కూడా వీరే ఫిక్స్ చేశారట. ఫోన్లో ఆహ్వానాలు అందుకున్న అధికారులకు.. అవతలివారు చెప్పిన లెక్క విని ఫీజులు ఎగిరిపోయాయి. ప్రస్తుతం అధికారపార్టీలోనూ.. అధికారవర్గాల్లోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ మొత్తానికి ప్రతినిధి అయిన ఈ లీడర్ గారి స్టైల్ ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉందని సెటైర్లు పేలుతున్నాయి.

గ్రేటర్ పరిధిలో ఇటీవల ఓ ప్రజాప్రతినిధి పుట్టినరోజు జరిగింది. సాధారణంగా అధికారంలో ఉన్నవారి బర్త్‌డే అంటే ప్రముఖులు.. అధికారులు వచ్చి శుభాకాంక్షలు చెప్పడం రివాజు. అయితే సదరు ప్రజాప్రతినిధి చాలా ముందు చూపుతో ఆలోచించారట. వెంటనే తన పర్సనల్ సెక్రటరీని రంగంలోకి దించి లెక్క పక్కా చేశారట. ఆ ప్రజాప్రతినిధి పరిధిలో ఉండే కీలక అధికారులకు పీఏ నుంచి ఫోన్లు వెళ్లాయట. ‘బర్త్‌డే విషెష్ చెప్పడానికి వస్తున్నారుగా.. వచ్చేటప్పుడు మీ వాటాగా పది లక్షలు గిఫ్ట్‌గా తీసుకురావాలి’ అని మొహమాటం లేకుండా అడిగేశారట. అలాంటి కీలక అధికారులు ఆరుగురు ఉండగా.. వారిలో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ కు తప్ప మిగతా ఐదుగురికి ఫోన్ చేసి లెక్క ఫిక్స్ చేశారు. దీంతో బర్త్‌డే ఆహ్వానం అందుకున్న వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందట.
బర్త్ డే గిఫ్ట్ రేట్లు ఫిక్స్ చేసిన వీరు పై స్థాయి అధికారులకైతే 5 లక్షలు.. మరికొందరికి 3 లక్షల చొప్పున పుట్టినరోజు బహుమతులు ఇవ్వాలని హుకుం జారీ చేశారట. చాలా మంది అధికారులకు ఈ తరహా ఫోన్లు వెళ్లడం.. వారు తమ వాటాలుగా లక్షలు సమర్పించుకోవడం జరిగిపోయినా తోటి ఉద్యోగులకు తెలియకుండానే బర్త్‌డే ఎపిసోడ్ ముగియడం విచిత్రం. పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అరగలేదో.. గిఫ్ట్‌గా ఇచ్చిన లక్షలు గుర్తొచ్చాయో కానీ..అధికారులు ఒకరినొకరు చెప్పుకొని ఊరట చెందాలని చూశారట. దాంతో నువ్వు అంత ఇచ్చావా..నేను ఇంత ఇచ్చాను అని చెప్పి ఒకరికొకరు గోడువెళ్ల బోసుకున్నారట. అలా క్యాష్ గిఫ్ట్‌ల సంగతి బయటకొచ్చి అధికారుల్లోనూ.. అధికారపార్టీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.