ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహాలు ఎప్పుడు ప్రత్యేకమే. ఇక ఉపఎన్నికలంటేన అంతకు మించిన వ్యూహాలు సిద్దం చేస్తారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది టీఆర్ఎస్. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికే..హుజురాబాద్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది.

ఇప్పటికే మండలాల వారీగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంఛార్జ్‌లను నియమించింది టీఆర్ఎస్. పార్టీ పిలుపు అందుకున్న నాయకులు.. తమకు అప్పగించిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ కాలు పెడుతూనే ఎన్నికల ప్రణాళికల్లో మునిగిపోయారు. గ్రామస్థాయిలో ఉపఎన్నికకు టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిత్యం వారితో మాట్లాడటం.. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు చేపట్టాల్సి పనులపై దిశానిర్దేశం చూస్తున్నట్టు తెలుస్తుంది.
బీజేపీ నుంచి బరిలో దిగాలని చూస్తోన్న ఈటల రాజేందర్..పదే పదే తాను ఉద్యమకారుడినని చెప్పుకొంటున్నారు. టీఆర్ఎస్లో తనను విమర్శించేవాళ్లంతా పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్లేనని తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో ఈటలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు కేసీఆర్. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారికి తోడుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఆర్ఎస్ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అక్కడ మోహరిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులను హుజురాబాద్ పంపబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినోద్‌కుమార్ ఆల్రెడీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తర్వాత ఉద్యమ నాయకులు మరికొంత మంది వెళ్తారని.. ఇందుకోసం జాబితా కూడా సిద్ధమైందని తెలుస్తోంది. టీఆర్ఎస్లోని ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో హుజురాబాద్‌లో మోహరిస్తే ఈటల మాటలకు గట్టిగా కౌంటర్ ఇవ్వొచ్చని అనుకుంటోంది అధికారపార్టీ శిబిరం.
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలను మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. దీంతో గతంలో జరిగిన ఉపఎన్నికలకంటే హుజురాబాద్ ఉపపోరు రసవత్తరంగా సాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.