టీఆర్ఎస్ పార్టీలో పదవుల పంపకం పై మళ్లీ హడావిడి మొదలైంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డు పదవులను భర్తీ చేయడంతో నామినేటెడ్ పదవులపై ఆశావహుల కన్నుపడింది. కార్పోరేషన్ చైర్మన్లు,ఎమ్మెల్సీ పదవుల పై ఆశలు పెట్టుకున్న ఒక్కో నేత తమ వంతు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా టీఎస్పీఎస్సీ తో మళ్లీ పదవుల పంపకం మొదలైందని గులాబీ పార్టీలో హడావిడి మొదలైంది.

గతంలో ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్ నేత సత్యనారాయణకు టీఎస్పీఎస్సీ బోర్డులో అవకాశం కల్పించారు. ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి ఆయన కేసీఆర్ కి అండగా నిలిచారు. కామారెడ్డి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుమిత్రానంద్ తనోబాకు ఇప్పుడు బోర్డు సభ్యురాలిగా కేసీఆర్ అవకాశం కల్పించారు. టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కారెం రవీందర్రెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకోగా ఆయనకు టీఎస్పీఎస్సీ బోర్డులో అవకాశం దక్కింది.
రాష్ట్రంలో ఇక అన్ని ఎన్నికలు ముగియడంతో పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెడతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మహిళా కమిషన్కు కొత్త కార్యవర్గాన్ని నియమించిన కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్ వంటి పదవులు భర్తి చేశారు. ఎమ్మెల్యే కోటాలో భారీగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రకియ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఎన్నికల కమీషన్ వాయుదా వేసింది. మొత్తానికి టీఆర్ఎస్ లో మళ్లీ పదవుల పంపకం పై హడావిడి మొదలైంది.