అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా..ఇప్పటి నుంచే టికెట్ కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మరోసారి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తుంటే.. ఈసారి ఎలాగైనా టికెట్ సాధించి బరిలో దిగాలని మరికొందరు సీనియర్లు పావులు కదుపుతున్నారట. ఇప్పటి నుంచి ప్లాట్ఫారం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

గెలిచేవరకు ఒక టెన్షన్. గెలిచిన తర్వాత పదవి నిలుపుకొనేందుకు మరో టెన్షన్. నియోజకవర్గంలో పట్టు సాధించడంతోపాటు..పార్టీలోని ప్రత్యర్థులపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే. లేదంటే వచ్చే ఎన్నికలనాటికి టికెట్ గ్యారెంటీ ఉండదు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి అదేనట. బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఓవర్‌లోడ్ అయిందని ఇప్పటికే పార్టీలో చర్చ నడుస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా రాథోడ్ బాపూరావ్ ఉన్నారు. మాజీ ఎంపీ నగేష్, గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అనిల్ జాదవ్‌లు పార్టీలో చేరి బలం చాటుకునేలా కార్యక్రమాలు సాగిస్తున్నారట. వీరిద్దరూ టికెట్ పై కన్నేసినట్టు తెలుస్తుంది.
ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం సైతం ఆధిపత్యపోరుతో హీటెక్కుతున్నట్టు చెబుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ రెండోసారి గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారట ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్. ఎక్కువ సమయం ఉట్నూరులో ఉంటూ మంత్రాంగాలు చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే రేఖానాయక్..ఇటు జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రచిస్తున్న వ్యూహాలు.. రేపోమాపో ఎన్నికలు అన్నట్టుగా ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా పార్టీలోని ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళ్తుండటంతో టీఆర్ఎస్ రాజకీయం వాడీవేడీగా ఉందట.
జిల్లాలో మరో ఎస్టీ నియోజకవర్గం ఆసిఫాబాద్‌లోనూ పాలిటిక్స్ గరంగరంగా ఉన్నాయట. గత ఎన్నికలలో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఓడిపోయారు. ఆత్రం సక్కు తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరగా.. కోవా లక్ష్మి జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. నేతల మధ్య సఖ్యత లేదు. నియోజకవర్గంలో ఎవరి వర్గం వారిదే. ఆధిపత్యం కోసం అప్పడప్పుడూ నేతలు చేసే పనులు రచ్చకు దారితీస్తుంటాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని అనుచరులకు చెబుతున్నారట కోవా లక్ష్మి. ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల్లో రాజకీయం ఎన్ని రంగులు మారుతుందో చూడాలి.