Home News

టీఆర్ఎస్ లో కుమ్ములాట కొత్త వివాదానికి దారి తీసిందా ?

పార్టీ ఉద్యమ సమయం నుంచి పని చేస్తున్న ఓ కార్యకర్త విడుదల చేసిన కరపత్రం మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపింది. అది జరిగి రెండు నెలలు దాటుతున్న వివాదం మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ టిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఒక సామాజిక వర్గానికే కొమ్ముకాస్తూ, బడుగు, బలహీనవర్గాలను చిన్నచూపు చూస్తున్నారని, ఉద్యమకారులను అణిచివేస్తున్నారనేది కరపత్రంలోని సారాంశం. ఐతే…ఎవరూ కూసుకుంట్ల ధోరణితో పార్టీని వీడొద్దని, కేసీర్, కేటిఆర్లను నమ్ముకోవాలని అవసరమైతే వారి వద్దకు వెళ్లి కలవాలని కరపత్రంలో ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది.

కరపత్రం ఎవరు వేయించారో తేలుసుకునే పనిలో పడ్డారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో చండూర్ ఎస్సై ఉపేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. పలు ప్రింటింగ్ ప్రెస్‌లలో తనిఖీలు చేయగా ఓ కరపత్రం లభ్యమయ్యిందట. అతణ్ణి విచారించి అసలు వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కస్తాల గ్రామానికి చెందిన రాజు తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నుంచి 2014 వరకు కూసుకుంట్ల వెంటే పని చేశారు. 2014లో తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి కూసుకుంట్లను మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఐతే…ఆ తరువాత నియోజకవర్గంలోని ఉద్యమకారులను పట్టించుకోలేదట. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయినట్లు కరపత్రంలో ముద్రించారు.

2014 తరువాత రాజు కొన్ని కారణాలతో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వెంట వెళ్లాడనేది పార్టీవర్గాలు చెబుతున్నాయ్. దీంతో రాజుపై కక్ష కట్టిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఎస్సైతో కూడా ఇబ్బందులకు గురిచేయడంతో ఎస్సైపై హెచ్చార్సీలో పిర్యాదు చేశాడట రాజు. ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగి టీఆర్ఎస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here