Home News Updates

బడా నేతలకు హ్యాండ్ ఇస్తున్న ఎమ్మెల్యేలు…!

టిఆర్‌ఎస్‌ మున్సిపల్ ఎన్నికలకు కెప్టెన్‌గా ఎమ్మెల్యేలను నియమించింది.. అది అంతర్గత కుమ్ములాటలకు కారణమవుతోందా? ఎమ్మెల్యేలు వారి అనుచరులకే టిక్కెట్లు ఇచ్చుకుంటే… మిగతా నేతల పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి ఇప్పుడు అన్ని జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. పలు నియోజకవర్గాల్లో పదవీ, ప్రాభల్యంతో చక్రం తిప్పిన నేతల అనుచరులకు మున్సిపల్ పోరులో టికెట్లు దక్కుతాయా ? టీఆర్ఎస్ లో మున్సిపల్ పోరు నియోజకవర్గాల్లో వార్ గా మారుతుందా…?

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీతో పాటు ఎన్నికలకు సంబంధించి అన్ని బాధ్యతలను ఎమ్మెల్యేలకు కట్టబెట్టారు గులాబీబాస్‌ .. గెలుపు గుర్రాలను వెతుక్కునే బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు … ఈ పరిస్థితి పార్టీలో కుమ్ములాటలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది .. అధినేత తీసుకున్న నిర్ణయంతో పలువురి నేతల్లో ఆందోళన మొదలయ్యిందట.. ఆయా నియోజకవర్గాల పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు నడుస్తుండటంతో .. ప్రస్తుత నిర్ణయం పలువురి నేతలను కలవరపెడుతుందట,

నల్గొండ మాజీ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి దేవరకొండ, మిర్యాలగూడలో బలమైన అనుచరగణమే ఉంది… గత సంవత్సరం చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల విజయంలో తనవంత పాత్ర పోషించారు గుత్తా… దేవరకొండలో భారీ మెజారిటీ రావడానికి గుత్తాకు ఈప్రాంతంపై ఉన్న పట్టు, బలమైన అనుచరగణం కూడా కారణమనే చెప్పాలి .. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి జగదీశ్ రెడ్డి కి సన్నిహితులుగా మారి.. గుత్తాకు హ్యాండ్‌ ఇచ్చారు.

ఇక కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి చేరడం అక్కడ పాత-కొత్త నేతల మధ్య బీభత్సమైన ఫైట్ కి దారి తీస్తుంది. మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతలు ఎమ్మెల్యేలకు కట్టబెట్టడంతో వాళ్ళు తమ అనుచరులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గతంలో నియోజకవర్గంలో చక్రం తిప్పిన నేతలకు ఇది గుబులు పుట్టిస్తుంది. మున్సిపల్ బరిలో ఉండాలని ఆ నేతల అనుచరులు ప్రయత్నిస్తున్నా.. టికెట్ల కేటాయింపు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో వారికి పరిస్థితి అర్థం కావడం లేదంట..

ఖమ్మంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అక్కడ కాంగ్రెస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వలస రావడంతో ఎమ్మెల్యేల పెత్తనం పై గుర్రుగా ఉన్నారు గులాబీ పార్టీ మాజీలు. దాంతో ఇప్పుడు వారి అనుచరులు రాజకీయ భవిష్యత్తుపై బెంగపెట్టుకుంటున్నారు. ఇక మహబూబ్ నగర్,నిజామాబాద్ లోనూ సేమ్ సీన రిపీట్ అవుతుంది. ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన బడా బాబులను సైతం లైట్ తీసుకుంటున్నారంట స్థానిక ఎమ్మెల్యేలు.

అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ తమకు కట్టబెట్టడంతో ఇదే అదునుగా భావిస్తున్న ఆ ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల్లో ఓల్డ్ బ్యాచ్ లకు చెక్ పెట్టాలని చూస్తున్నారట… ఇక ఈ ఆధిపత్యపోరులో ఎవరిది పైచేయి అవుతుందో…వీటిని ఎన్నికల కల్లా గులాబీ బాస్ ఎలా సెట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here