Home News Stories

ప్రచారానికి మీరే రావాలి…ఎన్నికల వేళ ఆ నేతలకు ఫుల్ డిమాండ్..!

ఎన్నికల ప్రచారానికి రావాలని ఆ సామాజిక వర్గం నేతలకు టీఆర్ఎస్‌లో డిమాండ్‌ పెరుగుతోందా? తెలంగాణలో బలంగా ఉన్న ఆ సామాజికవర్గం నేతలు అధికారపార్టీ ప్రచారానికి ప్లస్‌ అవుతారని నమ్మకమా? క్యాంపెయిన్‌కి కదులుతున్న ఆ నేతలు దేనిమీద ఫోకస్‌ పెట్టారు.? వారి టార్గెట్ ఏంటీ…?

నెలన్నర క్రితమే అభ్యర్థుల్ని ప్రకటించేసిన టీఆర్‌ఎస్‌ ముందస్తుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ప్రత్యర్థిపార్టీల కంటే క్యాంపెయిన్‌లో ముందుంది. నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ…అందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాల్ని అమలు చేస్తోంది. నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, ప్రత్యర్ధి పార్టీల బలబలాలను బేరీజు వేసుకుంటూ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభాని దృష్టిలో పెట్టుకుని…ఆ వర్గాలకు తన ప్రచారం చేరువయ్యేలా ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తోంది టీఆర్‌ఎస్‌.

బీసీ ఓటు బ్యాంక్‌పై గురిపెట్టిన టీఆర్‌ఎస్‌…ఆ సామాజికవర్గాలకు చేరువయ్యేలా , బలహీనవర్గాల్ని ఆకట్టుకునేలా ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న బీసీ నాయకులతో నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుంటున్న అభ్యర్థులు..ఆయా వర్గాలని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న బీసీ నాయకులు ఎన్నికల ప్రచారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్‌ సహా పలువురు బీసీ నేతల్ని అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాలకు ఆహ్వానిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ నేతలు ఆ వర్గాల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్ని ఓటర్ల దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ ఆయా సామాజిక వర్గాలను టీఆర్‌ఎస్‌కి చేరువచేసే ప్రయత్నం చేస్తున్నారు బీసీ నేతలు. దీంతో టీఆర్‌ఎస్‌లో బీసీ నేతలకు ఎన్నికల వేళ డిమాండ్ పెరిగిపోయింది. పార్టీ అధినాయకత్వం రాష్ట్ర స్థాయి నేతల్ని నియోజకవర్గాల ప్రచారానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో బీసీ సామాజికవర్గం నేతలు, మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల ప్రచారాల్లో బిజీ అయ్యారు.

బీసీ సామాజికవర్గానికి గౌరవప్రదంగానే టిక్కెట్లిచ్చామంటున్న అధికార గుళాబీ దళం వీరినే ప్రచార అస్త్రంగా కొన్ని నియోజకవర్గాల్లో కీ రోల్ ప్లే చేయాలని భావిస్తుంది. దీనిలో భాగంగా ఆయా కులసంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి హామీలను గుప్పిస్తున్నారు. ఏదేమైన ఎన్నికల వేళ గులాబీ దళం ఏ చిన్న చాన్స్ మిస్ చేసుకోకుండా ప్రచారంలో దూసుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here