Home News

వ్యాక్సిన్..ఆక్సిజన్ పై టీఆర్ఎస్,బీజేపీ మధ్య ముదిరిన వార్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రాష్ట్రంలో అంశం ఏదైనా సరే ఆరోపణలు..ప్రత్యారోపణలు టీఆర్ఎస్‌, బీజేపీలకు కామన్ అయిపోయింది. ఒకరిపై మరొకరు తప్పులు మోపుకుంటున్నారు. కేంద్రానిది తప్పని టీఆర్ఎస్ నేతలు అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనాన్ని కేంద్రంపై మోపుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వ్యాక్సిన్, ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇలా ఒకటేమిటి కరోనాకు సంబంధించిన ప్రతి అంశంపైనా ప్రస్తుతం పేచీ నడుస్తోంది. తెలంగాణకు కరోనా సాయం అందించటంపై అధికార టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు, టీఆర్ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. కేంద్రానికి అందరూ సమానమేనని అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వమే సరైన లెక్కలు ఇవ్వడం లేదని కరోనాపై రాజకీయాలు చేయడం మానుకోవాలంటున్నారు. టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహితంగా ఉందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం దృష్టిలో అందరూ సమానమేనని స్థానిక పరిస్థితులను బట్టి కేటాయింపులు ఉంటాయనేది బీజేపీ వాదన.

కేంద్రం వివక్ష చూపిస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తుందని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్, రెమిడిసివిర్ లాంటివి పంపించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో ఉన్న యాక్టివ్ కేసులు, కొత్తగా నమోదు అవుతున్న కేసులు, మరణాలు, జనాభాను దృష్టిలో పెట్టుకునే ఆక్సిజన్, రెమిడిసివిర్లను కేంద్రం కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులను, మరణాలను తక్కువగా చూపిస్తుందని కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లను ఓపెన్ కూడా చేయలేదని మండిపడ్డారు.

సీఎం సహాయ నిధి, పీఎం కేర్స్, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్‌లపై కూడా మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఎయిర్‌ఫోర్స్ విమానాలను పంపించింది మోడీయేనని బీజేపీ అంటుంటే కేసీఆర్ ముందు చూపు అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆ క్రెడిట్‌ను తీసుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. వ్యాక్సిన్ రేట్ల విషయంలోను కేంద్రం తీరును విమర్శిస్తుంది టీఆర్ఎస్. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని బీజేపీ అంటోంది. కంపెనీలతో మాట్లాడుకొని ధరలు తగ్గించుకోవచ్చు కదా అని బీజేపీ నేతలు అంటున్నారు.

ప్రభుత్వాలు విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన బెట్టి సమన్వయంతో కరోనా కట్టడికి ముందుకు ఎప్పుడో వస్తాయో అని సాధరణ ప్రజలు మదనపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here