బీజేపీకి ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు కొందరు నాయకులు కొత్త వివాదాలు కొనితెస్తున్నారు. జాత్యహంకారంతో మిడిసిపడే ఆస్ట్రేలియావాడో, తెల్లతోలు అమెరికావాడో మనల్ని తక్కువ చేసి మాట్లాడితేనే బాధపడతాం. అలాంటిది మన రంగును మనమే చులకన చేసుకుంటే ఎలాగన్న స్పృహ లేకపోయిందా సీఎంకి. అదృష్టం కలిసొచ్చి త్రిపుర ముఖ్యమంత్రి అయిన బిప్లబ్‌కుమార్‌దేబ్…రాష్ట్రంలో తన ముద్ర ఎలా వేయాలో చూసుకోకుండా తను కూడా వివాదంలో ఉండాలని ముచ్చటపడుతున్నట్లున్నాడు.
ఆ మధ్య ఓ ప్రోగ్రాంలో నోరుపారేసుకున్నాడు త్రిపుర సీఎం. ఐశ్వర్యారాయ్‌కి ప్రపంచ సుందరి కిరీటం వచ్చిందంటే ఆమె అద్భుత సౌందర్యరాశికాబట్టి. పాలమీగడలాంటి అందమున్న ఐశ్యర్య కిరీటం గెలుచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే డయానా హెడెన్‌కి ఎలా వచ్చిందో తనకు అర్ధంకావడంలేదని ఆశ్చర్యచకితుడైపోయాడు బిప్లబ్కుమార్.
అంటే ఆయన దృష్టిలో ఐశ్యర్య మేనిఛాయతో పోలిస్తే డయానా తేలిపోతుంది. తను ఛామనఛాయ. అందుకే పాపం సీఎంకి అంత చులకనైపోయింది. తను భారతీయుడ్ననీ, భారతీయుల్లో సింహభాగం గోధుమ వర్ణమేనని ఆ క్షణాన మర్చిపోయి నోరుపారేసుకున్నాడు త్రిపుర సీఎం.
రంగుని పోలుస్తూ త్రిపురసీఎం చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. బిప్లబ్కుమార్దేబ్పై మాజీ ప్రపంచ సుందరి డయానాహెడెన్ మండిపడింది. గోధుమవర్ణంలో ఉండే భారతీయుల అందచందాల్ని ప్రపంచం ఆదరించి నెత్తిన కిరీటం పెడుతుంటే.. కొందరు భారతీయులకే ఇది నచ్చకపోవడం సిగ్గుచేటంది డయానా హెడెన్. వర్ణవివక్షను వ్యతిరేకించే తాను ఫెయిర్‌నెస్ క్రీముల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తెల్లతోలుకి విలువనిచ్చే త్రిపుర సీఎం వంటి వారి ఆలోచనా ధోరణిపైనే తాను పోరాడుతున్నానన్న డయానా హెడెన్‌కి దేశవ్యాప్తంగా మద్దతు లభించటంతో…సీఎం బిప్లబ్‌దేబ్ సారీ చెప్పారు. ఉన్నవివాదాలు చాలవన్నట్లు ఈ రంగుల గోల అవసరమా?