గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతికి స్వరనీరాజనం అందిచబోతుంది తెలుగు చిత్ర పరిశ్రమ. బాలుకు గ్రాండ్ ట్రిబ్యూట్ నిర్వహించబోతోంది. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించబోతోంది. జూన్ 4న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో అతిరథమహారథులైన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాలు పంచుకోబోతున్నారు.

టాలీవుడ్ మొత్తం ఏక తాటిపైకి వచ్చి ఆన్ లైన్ వేదికగా చేపడుతున్న బృహత్తర కార్యక్రమమిది. ఆ గుండె గొంతుక ఎప్పటికీ మూగవోదని, ఆయన పాటలోని మాధుర్యం ఎన్నటికీ తరగబోదని చాటబోతున్నారు. బాలూకు స్వరనీరాజనంతో అంజలి ఘటించేందుకు చిత్ర పరిశ్రమ సిద్దమైంది. మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా అందరూ ఇందులో పాల్గొంటారు. నాన్ స్టాప్‌గా జరిగే ఈ ప్రోగ్రామ్ని చూసి అందరూ జయప్రదం చేయాలని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.