ఈ మాట ఎవరన్నా అంటే కడుపు మండిపోతుంది. కళామతల్లి ముద్దుబిడ్డలమని చెప్పుకునే వేలమంది ఆర్టిస్టుల గుండెలు రగిలిపోతాయి. అయితే తులసివనాన్నయినా ఒక్క గంజాయి మొక్క అపవిత్రం చేసినట్లు కొందరి నిర్వాకాలతో ఇండస్ట్రీనే కళంకితమవుతోంది. టాలీవుడ్ పేరెత్తితేనే అనుమానంగా చూసేలా సినీ పరిశ్రమ పరువు గంగలో కలిసింది. ఆ మధ్య డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ని కుదిపేస్తే..కాస్ట్ కౌచింగ్ ప్రకంపనలు ఇంకా సద్దుమణగనే లేదు. ఈలోపు అమెరికా కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్లో టాలీవుడ్ తారల సంబంధాలతో విదేశాల్లోనూ బట్టలిప్పుకుని బజారున పడ్డట్లయ్యింది. ఈ అనైతిక వ్యవహారంలో టాలీవుడ్‌తో పాటు శాండిల్ ఉడ్కి కూడా సంబంధముందని తేలినా తెలుగు తారలంటేనే ఈసడించుకునే పరిస్థితి దాపురించింది.
కొన్ని తెలుగు సిన్మాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ సినిమా హీరోయిన్లని అడ్డుపెట్టుకుని అమెరికాలోని షికాగోలో సాగించిన సెక్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకోసమంటూ అమెరికా విమానం ఎక్కుతున్న కొందరు హీరోయిన్లు అక్కడ హైక్లాస్ వ్యభిచారంతో లక్షలు సంపాదిస్తున్నారనే వార్తతో తెలుగు సినీ పరిశ్రమకు తలెక్కడపెట్టుకోవాలో అర్ధంకావడంలేదు. దక్షిణ కాలిఫోర్నియా తెలుగుసంఘం నిర్వహించే స్టార్ నైట్ కార్యక్రమానికి వెళ్లిన తెలుగు హీరోయిన్ షికాగోకు వెళ్లటంతో అనుమానమొచ్చి ఆరాతీసిన ఫెడరల్ పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిసొచ్చాయి.
హీరోయిన్లతో ఎంజాయ్ చేయాలనుకునేవారికి కిషన్ దంపతుల ఫ్లాట్ హైక్లాస్ వ్యభిచారానికి అడ్డాగా మారింది. వెండితెరపై అందాలు ఒలకబోసిన హీరోయిన్లను ఎరవేసి తక్కువలో తక్కువ 70వేలనుంచి 2లక్షలదాకా వసూలుచేసినట్లు వెల్లడైంది. కిషన్ భార్య చిట్టాపద్దులన్నీ రాసిపెట్టటంతో ఎవరెవరి జాతకాలు బయటికొస్తాయోనని కొందరు తారల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పొడుగు హీరోయిన్ అంటూ, సాయిధరమ్‌తేజతో ఎక్కువసార్లు నటించిందంటూ అప్పుడే లీకులు మొదలయ్యాయి. ఓ పాపులర్ యాంకర్ కూడా అదనపు సంపాదనకోసం షికాగో బిజినెస్‌ని షేర్ చేసుకుందంటున్నారు. బీవన్, బీటూ, విజిటింగ్ వీసాలపై సినీతారలు, మోడల్స్ , యాంకర్స్‌ని అమెరికా రప్పించి వారితో చీకటి వ్యవహారాలు సాగిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే కిషన్ దంపతులు 76 ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్లు వెల్లడైంది.
టాలీవుడ్‌నుంచి వచ్చారని తెలిస్తే ఇప్పుడు కిందికీ మీదికీ ఎగాదిగా చూస్తున్నారు అమెరికా పోలీసులు. అమెరికా వెగాస్ ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ మెహరీన్‌కి చేదు అనుభవం ఎదురైంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉందేమోనని గుచ్చిగుచ్చి అడిగారు. మెహరీన్‌తో పాటు మరో ముగ్గురు తెలుగు హీరోయిన్లకు కూడా కొన్నాళ్ల క్రితం ఇదే అనుభవం ఎదురైందంటున్నారు. తమను కూడా షికాగో దంపతులు సంప్రదించారని యాంకర్ అనసూయ, నటి శ్రీరెడ్డి చెప్పటంతో సెక్స్ రాకెట్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే సంచలన లీక్స్‌తో టాలీవుడ్‌ని బజారుకి లాగిన శ్రీరెడ్డి ఓ పాపులర్ తెలుగు ఛానల్ యాంకర్‌కి సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయంటోంది. ఆ రాకెట్‌కి సంబంధించి పూర్తి వివరాలు తనకు తెలుసంటూ అందరినీ టెన్షన్ పెడుతోంది. సీఎన్ఎన్ ఛానల్‌కి లిస్ట్ ఇచ్చానని చెబుతూ…టాలీవుడ్‌ని ఇంకాస్త గబ్బుపట్టించేలా ఉంది.