Home News Politics

ఓ ప‌నైపోయింది బాబూ..

ప‌వ‌న్‌క‌ల్యాణ్ దుకాణం ఇక బందేనా? జ‌న‌సేన ఐటీ సెంటర్‌కు టులెట్ బోర్డ్‌

ఊరికే ఎమోష‌న్ ఉంటే చాల‌దు. వేదాంతం వ‌ల్లిస్తే స‌రిపోదు. రాజ‌కీయ‌మంటే చావోరేవో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డాలి. చివ‌రిక్ష‌ణందాకా ఆశ‌లు వ‌దులుకోకుండా పోరాడాలి. ట్వంటీట్వంటీ మ్యాచ్ అయినా ఫిఫ్టీ ఓవ‌ర్స్ వ‌న్డే అయినా చివ‌రి బాల్‌దాకా అలాంటి ప్ర‌య‌త్న‌మే జ‌రుగుతుంది. ఎలాగూ గెలిచే మ్యాచ్ కాద‌ని ముందే ఎవ‌రూ చేతులెత్తేయ‌రు. రాజ‌కీయ‌మైనా అంతే. ఫ‌లితం ఎలాగైనా ఉండ‌నీ..ఎన్నిక‌ల చివ‌రిరోజు చివ‌రి నిమిషందాకా స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాల్సిందే. అది స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడి ప్రాథ‌మిక ల‌క్ష‌ణం. కానీ ఆవేశంగా ఊగిపోయి…కార్య‌క‌ర్త‌ల‌తో నినాదాలు ఇప్పించుకోగానే రాజ‌కీయాల్లో రాణించ‌లేమ‌న్న విష‌యం ఈపాటికే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి అర్ధ‌మై ఉండాలి.

ఇదేం అత్తారింటికి దారేది సిన్మా కాదు. ఫ్లైట్‌లో ఐల్యాండ్‌లో వాలిపోయి విల‌న్ల‌ను తుక్కు రేగ కొట్ట‌డానికి. గాల్లోకి విసిరిన క‌ళ్ల‌ద్దాలు కింద‌ప‌డేలోపే అంద‌రినీ చిత‌క్కొట్టేయ‌డానికి. మ‌ధ్య‌లో బ్రేకులు తీసుకుంటూ సీన్ ఓకే అయ్యాక ప్యాక‌ప్ చేస్కోడానికి. ఇది రాజ‌కీయం. విమ‌ర్శ‌లొస్తాయి. అవ‌మానాలు ప‌డాల్సి వ‌స్తుంది. దండాలు పెట్టాల్సి ఉంటుంది. ఎక్క‌డ నెగ్గాలో కాదు…ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన‌వాడే రాజ‌కీయాల్లో రాణిస్తాడు. ఈరోజు అన్న‌య్యే వంద‌రెట్లు న‌య‌మ‌నుకునేలా ఉంది జ‌న‌సేనాని రాజ‌కీయం. త‌ర్వాత పార్టీని న‌డ‌ప‌టం చేత‌గాక కాంగ్రెస్‌లో విలీనం చేసినా…మొద‌ట్లో ప్ర‌జారాజ్యాన్ని అంతోఇంతో జ‌నంలో నిల‌బెట్టాడు మెగాస్టార్‌. గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ద‌క్కించుకున్నారు. గెలుపోట‌ముల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించారు. కానీ ప‌వ‌ర్‌స్టార్‌లో ఆ మాత్రం ప‌వ‌ర్ కూడా లేక‌పోవ‌డ‌మే ఆయ‌న్ని న‌మ్ముకున్న‌వాళ్లంద‌రినీ తీవ్ర నిరాశ‌కు గురిచేస్తోంది.

ఇంకా ఫ‌లితాలు రాలేదు. కానీ ఎన్నిక‌లు పూర్త‌వ్వ‌గానే జ‌న‌సేన శ్రేణుల‌కు సీన్ అర్ధ‌మైపోయింది. యూత్‌లో, మ‌హిళ‌ల్లో ఆద‌ర‌ణ ఉన్నా దాన్ని ఓట్ల‌రూపంలో మ‌లుచుకోలేక‌పోవ‌డం ముమ్మాటికీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఫ‌ల్య‌మే. రేప్పొద్దున ఫ‌లితాల్లో ఏదో అద్భుతం జ‌రిగిపోతుంద‌న్న న‌మ్మ‌కంతో ఏ జ‌న‌సైనికుడూ లేడు. గాజువాక‌, భీమ‌వ‌రంలలో ప‌వ‌న్ గెలుపుపైనే నేత‌ల‌కు ఎన్నో అనుమానాలున్నాయంటే…ఇక ఆ పార్టీ గెలిచేదెక్క‌డ‌న్న‌దే ప్ర‌శ్న‌. టీడీపీ-వైసీపీ మ‌ధ్య జ‌రిగిన భీక‌ర‌పోరులో జ‌న‌సేన సైడైపోయింద‌నేది త‌ల‌పండిన విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అందుకే ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత ఎక్క‌డా జ‌న‌సేన సౌండ్ లేదు.

మొన్న‌టిదాకా దాదాపు 500మంది ఉద్యోగుల‌తో సంద‌డిగా క‌నిపించిన హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన ఐటీ సెంట‌ర్ అప్పుడే టులెట్ బోర్డెట్టేసింది. పార్టీ సోష‌ల్‌మీడియా ప్ర‌చారం కోసం రాయదుర్గం ఖాజాగూడా స‌మీపంలోని మూడంత‌స్తుల ఆఫీసును స్వ‌యానా జ‌న‌సేనాని ప్రారంభించారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న తోట చంద్ర‌శేఖ‌ర్ దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చూశారు. ఎన్నిక‌లు ముగిసిన వారంలోపే మూడంత‌స్తుల్లో ఒక‌టి ఉంచుకుని మిగిలిన రెండు అంత‌స్తుల‌కూ టు లెట్ బోర్డు త‌గిలించేశారు. 350మంది ఉద్యోగుల‌కు మీ సేవ‌లు అవ‌స‌రం లేద‌ని చెప్పేశారు.

ఎన్నిక‌ల‌య్యాక సోష‌ల్‌మీడియాతో ప‌నేంట‌ని జ‌న‌సైనికులు స‌మ‌ర్ధించుకోవ‌చ్చుగాక‌. కానీ ఇది యుద్ధానికి ముందే చేతులెత్తేయ‌డం లాంటిదే. కార్య‌క‌ర్త‌ల‌తో సీఎం సీఎం అనిపించుకున్న నాయ‌కుడు, క‌ర్ణాట‌క‌లాగా అద్భుతం జ‌రిగి తాను రాష్ట్రాధినేత‌ను అవుతాన‌ని అంచ‌నాలు వేసుకున్న నాయ‌కుడు ఫ‌లితాల‌కు ముందే…ప్యాక‌ప్ చెబుతున్న‌ట్లే ఉంది. కొన్నాళ్లు టీడీపీ-బీజేపీతో చెట్ట‌ప‌ట్టాలేసుకుని…త‌ర్వాత టీడీపీని తిడుతూ బీజేపీకి ద‌గ్గ‌రైన‌ట్లు క‌నిపించి…వైసీపీతో క‌లుస్తార‌నే ప్ర‌చారంతో అంద‌రినీ క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేసి…చివ‌రికి జ‌గ‌న్ ఒక్క‌డినే ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముగించారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఫ‌లితాల త‌ర్వాత జ‌న‌సేన ఎజెండా ఏంటో…ఆ పార్టీ జెండా ఉంటుందో లేదో కాల‌మే నిర్ణ‌యించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here