Home News

తిరుపతి ఫలితం బీజేపీ కంటే జనసేనకి తలనొప్పిగా మారిందా ?

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మళ్లీ డిపాజిట్ కోల్పోయింది. జనసేనతో పొత్తు పెట్టుకుని నానా హడావుడి చేసిన బీజేపీ పార్టీ..గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. అయితే ఓట్ల శాతం పెరిగిందంటూ నేతలు సర్థిచెప్పుకుంటున్నారు. బెంగాల్ ఎన్నికలపై స్పందించిన కమలనాథులు తిరుపతి ఫలితంపై మాత్రం కిక్కురుమనడం లేదు. ఇక బీజేపీతో కలిసి మరింత నష్టపోయామా అన్న భావన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతుంది.

తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి మళ్లీ ఓడింది. ఫలితం రిపీట్ అయింది. అయితే 2019 కంటే కాస్త గౌరవ ప్రదమైన ఓట్లు సాధించింది. ఈ సారీ డిపాజిట్లు రాకపోయినా..ఓట్ల శాతం మాత్రం పెంచుకుంది. 57 వేల ఓట్లు సాధించిన కాషాయ పార్టీ..డిపాజిట్ మాత్రం దక్కించుకోలేకపోయింది. 2019లోనే ఆ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. నాడు నోటా, కాంగ్రెస్, బీఎస్పి కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయ్. గత ఎన్నికల్లో బిజెపికి 16వేల 125 ఓట్లు రాగా…ఈ సారి 57 వేలకుపైగా సంపాదించుకోగలిగింది.

ఉప ఎన్నికల్లో బిజెపికి..జనసేన మద్దతు తెలిపింది. స్వయంగా పవన్ కళ్యాణ్‌ రోడ్ షో నిర్వహించారు. సామాజిక సమీకరణలు, ఇతర అంశాలు లెక్కలు వేసుకున్న బిజెపీ మంచి ఫలితమే వస్తుందని భావించింది. నేతలు కూడా అంతా తిరుపతిలో మకాం వేసి ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.తిరుపతిలో అభ్యర్థిని నిలబెట్టాలని జనసేన గట్టిగా ప్రయత్నించింది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో తామే పోటీ చేస్తామని చెప్పింది. సొంతగా పోటి చేసినా మరిన్ని ఓట్లు సాధించేవారిమన్న భావన జనసేన నేతల్లో వ్యక్తమవుతుంది.

ఢిల్లీ స్థాయిలో చర్చల అనంతరం రాష్ట్ర నేతలు మాట నెగ్గించుకున్నారు. నోటిపికేషన్ వచ్చిన తరువాత అభ్యర్థి ఎంపిక విషయంలో సుదీర్ఘంగా కసరత్తు చేసింది. బలమైన అభ్యర్థి అంటూ పొరుగు రాష్ట్రంలో పని చేసిన మాజీ ఐఎఎస్‌ను తెచ్చి బరిలోకి దింపింది. ఇన్ని చేసినా బిజెపి-జనసేన కూటమికి అశించిన ఫలితం దక్కలేదు. కనీసం డిపాజిట్లు తెచ్చుకుని ఉంటే మెరుగైన ఫలితం అనే వాదనకు బలం చేకూరేది. ఉప ఎన్నికల ఫలితం బిజెపికే కాకుండా జనసేనకు తలనొప్పిగా మారింది. కేంద్రం పై ఉన్న వ్యతిరేకత తమ ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసిందని చెబుతున్నారు జనసైనికులు.

బిజెపి అభ్యర్థి గెలిస్తే కేంద్ర క్యాబినెట్‌లో పదవి వస్తుందంటూ ప్రచారం చేశారు. అయినా ఓటర్లు ఆ పార్టీపై నమ్మకం చూపలేదు. ఈ ఫలితం సోము వీర్రాజు నాయకత్వానికి పరీక్షలా మారింది. ఇది నాయకత్వం వైఫల్యమేనని నేతలు..అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తే తమ ఉనికికే ప్రమాదమని జనసేన నేతలు చెబుతున్నారు. టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న తమ లక్ష్యాన్ని బీజేపీ పొత్తు దెబ్బ తీసిందని మదనపడుతున్నారు జనసేన నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here