Home News Stories

తుంగతుర్తి తకరారులో గెలుపెవరిది ?

ఉమ్మడి నల్గొండజిల్లాలోని నియోజకవర్గల్లో అంతర్భాగమైన తుంగతుర్తి అసెంబ్లీ స్థానం,భువనగిరి లోకసభ స్థానం కిందకి వస్తుంది. 2014లో తెలంగాణా రాష్ట్ర సమితి తరపున పోటీచేసి గెలుపొందిన గ్యాదరి కిషోర్‌ ప్రస్థుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన ప్రత్యర్థి పాతకాపు అద్దంకి దయాకర్‌ తోనే మళ్ళీ తలపడుతున్నారు. గతంలో స్వల్ప తేడాతో అద్దంకి పై గెలిచిన కిశోర్ పనితీరు ఎలా ఉంది…తుంగతుర్తిలో ఓటర్లు ఎవరికి పట్టంకట్టబోతున్నారు తెలుగుపాపులర్ టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..


సూర్యాపేట జిల్లాలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోకి మొత్తం మూడు జిల్లాల మండలాలు వస్తాయి. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, నూతనకల్‌, మద్దిరాల, నాగారం, తిరుమలగిరి, అర్వపల్లి, యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 1,14,641 మంది పురుషులు, 1,12,583 మంది స్త్రీలు కలిసి 2,27,233 మంది ఓటర్లు ఉన్నారు. 1962లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 1983 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది పర్యాయాలు పోలింగ్ జరుగగా ఎక్కువగా కాంగ్రెస్ 3 సార్లు అవకాశం అందిపుచ్చుకోగా,టీడీపీ 2 సార్లు,సీపీఎం,టిఆర్ఎస్,స్వతంత్రులు తలొసారి గెలుపొందారు.


ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీల పరంగా కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ కోసం కొంత ఆధిపత్య పోరు సాగింది. టీఆర్ఎస్ తరపున తోలి జాబితాలోనే చోటు దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి జ్ఞానసుందర్ , వడ్డేపల్లి రవి, గుడపాటి నర్సయ్య టిక్కెట్ కోసం అద్దంకి దయాకర్ తో పోటిపడ్డారు. మొదట అద్దంకి దయాకర్ అభ్యర్ధిత్వం పై కొంత సందిగ్ధం ఉన్నా ఎట్టకేలకు టిక్కెట్ దక్కించుకున్నారు. అద్దంకి మినహా మిగిలినవారంతా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయులు.

ఇక పార్టీల బలబలాల విషయానికి వస్తే ఇక్కడ రెండు పార్టీలు పోటాపోటిగానే ఉన్నాయి. అభ్యర్ధుల విషయం ఇక్కడ కీలకం కానుంది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ అభ్యర్ధీకి ప్లస్ అవుతుండగా అభివృద్ది నినాదంతో గులాబీ పార్టీ జనంలోకి వెళ్తుంది. అద్దంకి దయాకర్ గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి కొంత ఆయనకు ప్లస్ పాయింట్. ఇక టికెట్ దక్కని నేతలు దయాకర్ కి ఎంతవరకు సహకరిస్తారన్నదానిపై హస్తం పార్టీ విజయం ఆదారపడి ఉంది. ఇక గ్యాదరి కిశోర్ పై నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉన్నా కేసీఆర్ ఇమేజ్ ఈయనకు ఇక్కడ ప్లస్ పాయింట్ గా మారింది. ప్రస్థుత పరిస్థితిలో ఇరు పార్టీల మధ్య ఇక్కడ హోరాహోరి పోరు తప్పేలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here