Home News

ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్న టెన్త్,ఇంటర్ పరీక్షలు

ఏపీలో విద్యార్దుల పరీక్షలు రాజకీయంగా హీట్‌ పెంచుతున్నాయ్‌.. ఎగ్జామ్స్‌ పెట్టి తీరుతామని ప్రభుత్వం చెబుతుంటే.. కరోనా ఉధృతిలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దీంతో ఈ రగడ హైకోర్టుకు చేరింది. ఇతర రాష్ట్రాలన్నీ పరీక్షలు రద్దు చేసి.. విద్యార్ధులను ప్రమోట్ చేస్తుంటే.. ఏపీ సర్కార్‌ మాత్రం ఎగ్జామ్స్‌కే ఎందుకు మొగ్గు చూపుతోంది అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

దేశంలో కరోనా కలకలం రేపుతోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయ్‌. ఏపీలోనూ కేసులు పది వేల వరకు వస్తున్నాయ్‌..అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ భయానికి అనేక రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయ్‌. తెలంగాణ వరుసగా రెండో ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలను రద్దు చేసి.. విద్యార్ధులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్రలోనూ అదే జరుగుతోంది. అన్ని రాష్ట్రాల మాట ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం భిన్న దారిలో వెళ్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి,ఇంటర్ విద్యార్ధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు పెట్టాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా విడుదలైంది.

ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఓ వైపు కోవిడ్‌ కేసులు పెరుగుతుంటే..పరీక్షలు ఎలా పెడుతారని ప్రశ్నిస్తున్నాయ్‌ విపక్షాలు. పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న టీడీపీతో పాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కరోనా ఉధృతిలో విద్యార్ధుల తల్లిదండ్రుల పరీక్షలు వద్దని చెబుతున్నారని.. పరీక్ష వద్దు ప్రాణం ముద్దు అంటున్నారని టీడీపీ చెబుతోంది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే.. పరీక్షలేంటని ప్రశ్నిస్తోంది. సర్కార్‌ నిర్ణయాన్ని టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటున్నారు. నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగానే..కోర్టు దగ్గరికి, ప్రధాని దగ్గరికి వ్యవహారం వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

పరీక్షల విషయంలో వైఖరి మార్చుకోవద్దని జగన్‌ సర్కార్‌ భావిస్తోంది. ఎందుకంటే గతేడాదే కరోనా కారణంగా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించలేదు. ప్రమోట్‌ చేయడంతో అందరూ ఉత్తీర్ణులు అయ్యారు. ఇందులో ఐదు లక్షలకు పైగా విద్యార్ధులు ఉన్నారు. ఏడాది గడిచిన పరిస్థితుల్లో మార్పు లేకుంటే.. ఎలా అని ప్రభుత్వం అనుకుంటోంది. అందుకే మళ్లీ అలాంటి నిర్ణయం సరైంది కాదనే భావనలో ప్రభుత్వ పెద్దల్లో ఉంది. టెన్త్‌, ఇంటర్‌ మార్కుల సర్టిఫికేట్లపైనే విద్యార్థుల భవిష్యత్‌ ఆధారపడి ఉందని ప్రభుత్వం అంటోంది. మంచి కాలేజీలో సీటు రావాలంటే మార్కులు ఉన్న సర్టిఫికేట్‌కే ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here