Home News Politics

పార్టీ బ‌లోపేత‌మా! వ్వాటే జోక్‌!!

తెలంగాణ‌పై బాబు దింపుడుక‌ళ్లెం ఆశ‌

ఓ ప‌క్క ప్రాంతీయ‌పార్టీలు జాతీయ‌స్థాయిలో గుర్తింపుకోసం పాకులాడుతుంటే..చేజేతులా బ‌ల‌మున్న చోట పార్టీని నాశ‌నం చేసుకుని ఇప్పుడేదో బ‌ల‌ప‌డాల‌నుకుంటే అంత‌కంటే పిచ్చిత‌నం మ‌రొక‌టి ఉంటుందా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగాక తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బ‌ల‌హీన‌ప‌డ‌టానికి అధినేత స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మ‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. మ‌రీ ముఖ్యంగా ఓటుకునోటు ఇష్యూ త‌ర్వాత హైద‌రాబాద్‌లో మొహం చెల్ల‌క.. ఛ‌లో అమ‌రావ‌తి అంటూ వెళ్లిపోయి మ‌ళ్లీ పార్టీ బ‌తికుందా చ‌చ్చిందా అన్న‌ది చూసుకోకుండా…ఇప్పుడేదో క్యాన్ల‌కు క్యాన్లు టానిక్‌లు తాగించ‌మంటే ఎలా?
కేసీఆర్ అధికారంలోకి రాగానే మొద‌ట టార్గెట్ చేసుకున్న‌దే టీడీపీని. ఆంధ్ర పార్టీగా ముద్రేయ‌డ‌మే కాదు…ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేల‌తో పాటు ముఖ్య నేత‌లంద‌రినీ త‌న‌వైపు లాగేసుకున్నారు గులాబీబాస్‌. చివ‌రికి టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. మిగిలిన నాయ‌కుల‌న‌న్నా స‌మ‌న్వ‌య‌ప‌రుచుకుని పార్టీ ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం జ‌రిగిందా అంటే..అదీలేదు. చివ‌రికి పార్టీ త‌ర‌ఫున కాస్త గ‌ట్టిగా మాట్లాడే రేవంత్‌రెడ్డి (ఓటుకునోటు పాత్ర‌ధారి) కూడా జిల్లాల్లో మిగిలిన కాస్త గ‌ట్టి నేత‌లంద‌ర్నీ వెంటేసుకుని కాంగ్రెస్‌లో చేరిపోయారు.

తెలంగాణ‌లో టీడీపీకి ఇప్పుడు మిగిలింది ఇద్ద‌రే ఎమ్మెల్యేలు. ఒక‌రు సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, మ‌రొక‌రు బీసీ నేత ఆర్‌.కృష్ణ‌య్య‌. టీడీపీ బీఫాం మీద గెలిచాడ‌న్న మాటేగానీ ఏ రోజూ కృష్ణ‌య్య‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఎవ‌రూ అనుకోలేదు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన వ్య‌క్తి పార్టీకెందుకు దూరంగా ఉంటున్నాడో, ఆయ‌న ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు. ఒక‌వేళ జ‌రిగి ఉన్నా ఫ‌లించ‌లేదు. కృష్ణ‌య్య ఏ క్ష‌ణాన్న‌యినా టీడీపీతో త‌న‌కు సంబంధం లేద‌ని ప్ర‌క‌ట‌న‌చేసేలా ఉన్నారు. నాలుగేళ్లు తెలంగాణ‌లో పార్టీని గాలికొదిలేసి..ఇంకో ఏడాదిలో ఎన్నిక‌లున్నాయ‌ని ప‌రిగెత్తించండి..ఇర‌గ‌దీయండంటే ఉన్న నేత‌లేమ‌న్నా జాకీచాన్‌లా?

రాష్ట్రం విడిపోయిన‌ప్పుడే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నే డిమాండ్ తెర‌పైకొచ్చింది. అది చెవిన‌ప‌డ‌న‌ట్లే ఉండిపోయింది అధినాయ‌క‌త్వం. త‌ర్వాత నారావారి వార‌సుడు లోకేష్ చ‌క్రం తిప్పాల‌న్నా బండి మొండికేసింద‌నీ, ఇక షెడ్డుకెళ్లేలా ఉంద‌నే విష‌యం అర్ధ‌మైంది. ఇప్పుడేమో ఎవ‌రో ఓ నాయ‌కుడు నారా బ్రాహ్మ‌ణికి తెలంగాణ పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అడ‌గ‌డం, తన కోడ‌లికి రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేద‌ని చంద్ర‌బాబు చెప్ప‌టం..మ‌రో నాట‌కీయ ప‌రిణామం. మిగిలిన నేత‌ల‌కు నైతికంగా బ‌ల‌మిస్తూ, వారిని అన్నివిధాలా ఆదుకుని ఎన్నిక‌ల‌కు ఎలా సిద్ధంచేయాల‌నేది చూడ‌కుండా…ఇప్పుడేదో అద్భుతాలు జ‌రిగిపోవాలంటే అల్లావుద్దీన్ అద్భుత‌దీపం ఎక్క‌డ‌న్నా దొరుకుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here