Home News Politics

తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా?

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు స‌ర్కారుకు ప‌ట్ట‌వా? రాజ‌కీయాల‌తోనే కాలం వెళ్ల‌దీస్తారా?

సెంటిమెంట్‌తో భావోద్వేగాల్ని రగిలించారు. ఎన్నేళ్లు ఇలా ఆంధ్ర వ‌ల‌స‌పాల‌కుల ద‌యాదాక్షిణ్యాల‌పై బ‌త‌కాల‌ని ఆక్రోశించారు. మ‌న రాష్ట్రం మ‌న పాల‌న నినాదంతో ఊరూవాడా క‌దిలించారు. మొత్తానికి ప్ర‌త్యేక రాష్ట్రం సాధించారు. ఉద్య‌మ‌కాంక్ష ఎప్ప‌ట్నించో ఉన్నా…మ‌లిద‌శ ఉద్య‌మానికి ఊపు తీసుకొచ్చింది మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆరే. రాష్ట్రం సాధించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో అన్ని రాజ‌కీయ‌ప‌క్షాలు, ప్ర‌జాసంఘాలు, ఉద్య‌మ‌సంస్థ‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చాయి. తెలంగాణ రాష్ట్రం సాకార‌మ‌య్యాక ఆయ‌న్ని అధికారంలోకి తీసుకొచ్చి కృత‌జ్ఙ‌త చాటుకుంది తెలంగాణ స‌మాజం. స‌రైన కార‌ణాలు లేకుండా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లినా…ఆయ‌న నాయ‌క‌త్వాన్నే న‌మ్మారు. మ‌ళ్లీ అధికారం క‌ట్ట‌బెట్టారు.

రెండోసారి అధికారంలోకొచ్చాక ఐదునెల‌లుగా తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయ వ‌ల‌స‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ అని గులాబీ గ్యాంగ్ అంద‌మైన పేరు పెట్టుకున్నా…ఫిరాయింపుల ప‌ర్వం శృతిమించి రాగాన ప‌డింది. 88 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ బ‌లం…విప‌క్ష ఎమ్మెల్యేల చేరిక‌ల‌తో వంద‌దాటినా సంతృప్తి ప‌డ‌టం లేదు. కుద‌ర‌ద‌ని టార్గెట్ చేయ‌లేదుగానీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌కు కూడా గులాబీ కండువాలు క‌ప్పేయాల‌న్నంత క‌సిమీదుంది టీఆర్ఎస్ నాయ‌క‌త్వం. భ‌విష్య‌త్తులో త‌మ నిర్ణ‌యాల్ని ప్ర‌శ్నించేవారే ఉండ‌కూడ‌ద‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న కాబోలు. మే 23 త‌ర్వాత ఎప్పుడ‌యినా జ‌ర‌గొచ్చ‌నుకుంటున్న వార‌సుడి ప‌ట్టాభిషేకానికి ఎలాంటి రాళ్లూర‌ప్ప‌లు త‌గ‌ల‌కుండా ప‌చ్చ‌తివాచీ ప‌ర‌చాల‌నుకుంటున్నారు.

రెండోసారి అధికారం క‌ట్ట‌బెట్టిన తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చాల్సిన ప్ర‌భుత్వం పూర్తిగా రాజ‌కీయాల్లోనే మునిగిపోయింది. ఇక్క‌డి రాజ‌కీయం చాల‌ద‌న్న‌ట్లు ప‌క్క‌నున్న ఏపీ రాజ‌కీయాల్లోనూ వేలుపెట్టి…చంద్ర‌బాబుకు రిట‌న్ గిఫ్ట్ ఇస్తామంటూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగింది. రాజ‌కీయం కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అన్న ప‌రిమితుల్ని తుడిచిపెట్టేసింది టీఆర్ఎస్‌. విప‌క్ష‌పార్టీల్ని నిర్వీర్యం చేసే మాటేమోగానీ ఇంట‌ర్ రిజ‌ల్ట్‌లో త‌ప్పిదాల‌తో స‌ర్కారు ప‌రువు పోయింది. పిల్ల‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌తో తెలంగాణ స‌మాజంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మవుతోంది. పిల్ల‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడింద‌నే చెడ్డ‌పేరును స‌ర్కారు మూట‌గ‌ట్టుకుంది.

ఏ పిల్ల‌వాడ్ని క‌దిలించినా ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఏత‌ల్లిదండ్రుల్ని ప‌ల‌క‌రించినా ఆక్రోశంతో ర‌గిలిపోతున్నారు. ఇంట‌ర్ ఫ‌లితాల‌పై దిద్దుబాటు చ‌ర్య‌ల విష‌యంలో ఆల‌స్యంగా స్పందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌…ఫిల్మ్‌న‌గ‌ర్‌కు శార‌దాపీఠాధిప‌తి రాగానే రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. న‌మ్మి గెలిపించిన ప్ర‌జ‌ల‌కంటే న‌మ్మ‌కాలు, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ఒక‌ప్ప‌టి ఉద్య‌మ‌నేత‌కు ముఖ్య‌మైపోయాయ‌ని ప్ర‌జ‌లు బాహాటంగానే త‌ప్పుప‌డుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో త‌న పాట‌ల‌తో హోరెత్తించిన ఒక‌ప్ప‌టి ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం వ‌స్తుందంటున్నారు. ఏ సెంటిమెంట్‌తోనైనా రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వ‌చ్చిందో…అదే సెంటిమెంట్ రివ‌ర్స‌యితే త‌ట్టుకోలేమ‌నే విష‌యాన్ని ఇప్ప‌టికైనా టీఆర్ఎస్ అధినేత గ్ర‌హిస్తారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here