Home News Politics

మ‌ళ్లీ డుమ్మా..ఎందుక‌మ్మా?

దీని భావ‌మేమి చంద్ర‌శేఖ‌రా?

కేంద్రం తీరుతో రైతుల‌కు అన్యాయం జ‌రిగితోంద‌ని ఆమ‌ధ్య ఆగ్ర‌హంతో ఊగిపోయారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఓ ద‌శ‌లో మోడీపై నోరుజారారు. ఎన్నోసార్లు వాడెంత‌..వీడెంత అన్న అలవాటులో ఓ మాట‌నేశారు. ప్ర‌ధానిని ప‌ట్టుకుని అంత మాటంటారా..అంటూ కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బాధ‌ప‌డిపోతే..తండ్రి వ్యాఖ్య‌ల తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు ఆయ‌న గారాల పుత్రిక క‌విత‌. మోదీగారు అన‌బోయి చివ‌రి అక్ష‌రంలో పొర‌పాటు దొర్లింద‌ని స‌రిచేయ‌డానికి ట్రై చేశారు. రైతుల క‌ష్టాల‌పై తీవ్ర ఆవేద‌న‌తోనే సీఎం కాస్త క‌టువుగా మాట్లాడారంటూ క‌వ‌రింగ్ చేసుకున్నారు. మోడీని ఓ మాట‌న్నందుకే ఇంత డ్రామా అంతా.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తెర‌పైకి తెస్తున్న స‌మ‌యంలో దాని అవ‌స‌రాన్ని..దేశంలో జ‌రుగుతున్న అన్యాయాల‌పై ఓ రేంజ్‌లో స్పీచ్ దంచేశారు కేసీఆర్‌. రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌న‌మేంట‌ని నిల‌దీశారు. రాష్ట్రాలు స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించే స్వేచ్ఛ ఉండాల‌ని కోరుకున్నారు. ఇన్ని సుద్దులు చెప్పిన టీఆర్ఎస్ అధినేత‌…కేర‌ళ‌లో జ‌రిగిన ద‌క్షిణాది ఆర్థిక‌మంత్రుల స‌మావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు. 15వ ఆర్థిక‌సంఘం సిఫార్సుల్ని వ్య‌తిరేకించేందుకు పెట్టిన ఆ మీటింగ్‌కి తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు దూరంగా ఉన్న‌ట్లు? త‌మ రాష్ట్రానికి జ‌రిగే న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌నే ధీమానా? ప‌దేప‌దే మోడీ మ‌న‌సు గాయ‌ప‌ర‌చ‌డం మంచిది కాద‌నా?

స‌రే…కేర‌ళ మీటింగ్‌కి వెళ్ల‌క‌పోవ‌డానికి ఏదో సాకు ఉండొచ్చు. ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న ఆర్థిక‌మంత్రుల మీటింగ్‌కి హాజరై త‌మ అభ్యంత‌రాల్ని వ్యక్తంచేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు ముందుకు రాలేదు? అప్పుడెప్పుడో జీఎస్టీ వ‌చ్చిన కొత్త‌లో అది రాష్ట్రానికి న‌ష్ట‌మేన‌ని తెలంగాణ ఆర్థిక‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెబితే..అన‌వ‌స‌ర అపోహ కింద కొట్టిపారేశారు కేసీఆర్‌. అది నిజ‌మేన‌న్న విష‌యం ఆ త‌ర్వాత ఆయ‌న‌కు బోధ‌ప‌డింది. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల్ని కేంద్రం రుద్ద‌డానికి ముందే అభ్యంత‌రాలు వ్య‌క్తంచేసేందుకు ఉన్న అవ‌కాశాన్ని కేసీఆర్ కాల‌ద‌న్నుకోవ‌డాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి? తెలంగాణ‌, క‌ర్ణాట‌క త‌ప్ప మిగిలిన బీజేపీయేత‌ర రాష్ట్రాల ఆర్థిక‌మంత్రులంతా స‌మావేశ‌మ‌వుతున్నారు. పొరుగురాష్ట్ర‌మే దీనికి వేదిక‌వుతున్న‌ప్పుడు కేసీఆర్‌కున్న అభ్యంత‌రాలేంటి?

ఇప్పుడు నోరెత్త‌కుండా రేప్పొద్దున ఆ సిఫార్సులు అమ‌లై…ఆర్థిక సంవ‌త్స‌రాంతంలో రాష్ట్రానికి వాటిల్లిన న‌ష్టాన్ని లెక్కేసుకుని అప్పుడు గుండెలు బాదుకుందామ‌నా? అప్పుడు కేంద్రంమీద ఆవేశ‌ప‌డ‌దామ‌నా? కేంద్రానికి వ్య‌తిరేకంగా ఏక‌మ‌వుతున్న రాష్ట్రాల‌తో క‌లిస్తే మోడీ క‌న్నెర్ర‌చేస్తార‌నా? ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కి మ‌ద్ద‌తు కోరుతూ రేపు మ‌రో జాతీయ‌నేత‌ను క‌లిసేందుకు వెళ్తే…ఆ మీటింగ్‌కి మీరెందుకు వెళ్ల‌లేదంటే కేసీఆర్ అప్పుడు స‌మాధానం వెతుక్కుంటారా? నోటితో మాట్లాడుతూ నొస‌టితో వెక్కిరించ‌డ‌మంటే ఇదే. చిత్త‌శుద్ధిలేని లేన‌ప్పుడు ఎన్ని పూజ‌లు చేసినా దండ‌గే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here