తెలంగాణ శాసన మండలిలో చైర్మన్,డిప్యూటి చైర్మన్ ల పదవీ కాలం నేటితో ముగియనుంది. మండలి చైర్మన్ గా గుత్తా,డిప్యూటీ చైర్మన్ గా నేతి విద్యాసాగర్ ల పదవీకాలం పూర్తయింది. వీరి పదవీ కాలం ముగిసే సరికి కొత్తవారిని భర్తీ చేయాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ వీరిద్దరికి చాన్స్ దక్కుతుందా లేదా అన్నది కేసీఆర్ నిర్ణయం భట్టి ఉంటుంది. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు మరో సారి అవకాశమివ్వడం కష్టమే అని గుత్తా విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది.

మండలిలో వాస్తవానికి ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతుండగా..ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే ఇద్దరున్నారు. సాగర్ ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి పై కోటిరెడ్డికి హామీ ఇవ్వడంతో నల్గొండ నుంచి ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి దక్కుతుంది అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది. గుత్తా ఎమ్మెల్సీగా కనీసం నిండా రెండేళ్లు కూడా పదవిలో లేరు. ఆయనకు చైర్మన్ పదవి కట్టబెట్టినా.. కేవలం 21 నెలలే కావడంతో.. మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. శాసనమండలి చైర్మన్ గా 20 నెలలు పదవిలో కొనసాగారు.
డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఇప్పటికే రెండో సారి అవకాశం దక్కించుకున్నారు. 2014కి ముందు నుంచే మండలి డిప్యూటి చైర్మన్ గా ఉన్న నేతి 2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ చైర్మన్గా తిరిగి పోస్టు దక్కించుకున్నారు. 2012నుంచి తొమ్మిదేళ్లపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా కొనసాగారు. ఇక మరో మారు అవకాశం కష్టమే అని తెలుస్తుంది.